ఏపీలో వాలంటీర్లకూ అన్ని పనులూ అప్పగిస్తున్నారు. వారు ఉద్యోగులు కాదు. రూ. ఐదు వేలకు పని చేసే వాలంటీర్లు. అయినా కీలకమైన బాధ్యతలిస్తున్నారు. ఇప్పుడు ధాన్యం సేకరణనూ వారికే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధాన్యం సేకరణ సీజన్ ప్రారంభం కావడంతో రైతు పండించిన ధాన్యం కళ్లాల్లో ఉన్నప్పటి నుంచి ధాన్యం సేకరణ, తరలింపు నుంచి మిల్లర్ వద్దకు ధాన్యం చేర్చి రశీదు తీసుకునే వరకు గ్రామ వాలంటీర్లకే బాద్యత ఇచ్చేశారు. సేకరించిన ధాన్యాన్ని తరలించే వాహనానికి రూట్ ఆఫీసర్లుగా కూడా వాలంటీర్లే వ్యవహరిస్తారు.
రైతు వద్ద ధాన్యం సేకరించేటప్పుడు క్వాలిటీని పరిశీలించడంతోపాటు ధాన్యాన్ని తూకం వేయడం, రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడటంపై వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు. అయితే ప్రతీ పనిలోనూ వారి తీరు వివాదాస్పదం అవుతోంది. సాధారణంగా అధికారులే.. బాధ్యత ఉన్న వారు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడే.. ధాన్యం సేకరణలో అనేక అవకతవకలు జరిగేవి. ఇప్పుడు నేరుగా వాలంటీర్లే చేస్తే.. రైతుల ప్రయోజనాలు కాపాడుకోవడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. అయినా ప్రభుత్వం లెక్క చేయడం లేదు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలు … గవర్నమెంట్ వ్యవహారాలు మొత్తంలో వాలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. ఇప్పుడు ధాన్యం సేకరణ బాధ్యతలు కూడా వారికే ఇవ్వడంతో వారి ప్రాధాన్యం మరింత పెరిగినట్లయింది. వాలంటీర్లు చేసే అక్రమాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. అన్నీ వాలంటీర్లే చేస్తూంటే.. ఇక ఉద్యోగులెందుకని..వారిని తప్పించేస్తారా అన్న చర్చ కూడా ప్రారంభమయ్యే పరిస్థితి వచ్చింది.