ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన నేతలతో పాటు ఆ పార్టీ నేతల డైరక్షన్ లో పని చేసిన వాలంటీర్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. టీడీపీ, జనసేనను వీడి భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేసుకున్నామని ఆ పార్టీలను వీడిన నేతలు ప్రస్తుతం ఆవేదన చెందుతుంటే…వైసీపీ నేతలు చెప్పారని రాజీనామా చేసిన గ్రామ, వాలంటీర్లు రోడ్డున పడ్డామని వాపోతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవహారం వివాదస్పదం అయింది. వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఫిర్యాదులతో వారిని విధులకు దూరంగా ఉంచింది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాలంటీర్లతో రాజీనామా చేయించి ఎన్నికల్లో తమకు మద్దతుగా పని చేయించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,08,273మంది వాలంటీర్లు వైసీపీ నేతల మాటలు విని రాజీనామా చేశారు. వైసీపీ నేతల ఆదేశాలతో ఓటర్లకు నగదు పంపిణీ కూడా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎవరూ అధైర్యపడవద్దని చంద్రబాబు చెప్పినా… వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్మబలికి వారిని ఎన్నికల్లో వినియోగించుకున్నారు వైసీపీ నేతలు.కట్ చేస్తే ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
దీంతో వైసీపీ నేతల మాటలు విని రాజీనామా చేసిన లక్ష మంది వాలంటీర్ల పరిస్థితి తలకిందులు అయింది. కూటమి అధికారంలోకి రావడంతో తమ భవిష్యత్ ఏంటని వాలంటీర్లు ప్రశ్నిస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మొహం తిప్పేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గని వాలంటీర్లకు మంచి రోజులు రాబోతున్నాయని… అలాగే జీతాలు కూడా రెట్టింపు చేస్తామన్న చంద్రబాబు హామీ వారిని ఉత్సాహపరుస్తోంది.