జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం మళ్లీ దక్కించుకోవాలి. ఎత్తుగడలు వేస్తున్నా అవన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్దీ చోటు చేసుకుంటున్న ఈ వరుస పరిణామాలు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
వాలంటీర్లను రంగంలోకి దింపి వారితో రాజకీయం చేయించాలనుకున్న వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. వాలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో వైసీపీ నేతలు నానా తంటాలు పడాల్సి వస్తోంది. వాలంటీర్ గా రాజీనామా చేసి వైసీపీ తరఫ్గున ప్రచారంలో పాల్గొనాలని వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ఒత్తిడి చేస్తున్నారు. పదివేలు ఇస్తామని ఆశ చూపుతున్నా వాలంటీర్లు ససేమీరా అంటున్నారు. రాజీనామా చేసి వైసీపీ తరఫున ప్రచారం చేస్తే మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుంటే తమ పరిస్థితి ఏంటి..? ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా మమ్మల్నే వాలంటీర్లుగా నియమిస్తారని గ్యారంటీ ఏంటి..? అని వైసీపీ నేతలకు ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. వైసీపీ నేతల ఒత్తిడి మేరకు కేవలం 40వేల మంది రాజీనామా చేసినా వారిలో కొంతమంది టీడీపీలో చేరడం వైసీపీని కలవరపాటుకు గురి చేస్తోంది.
తామెందుకు రాజీనామా చేయాలని వాలంటీర్లు వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. గతంలో పారితోషకం పెంచాలని ఆందోళనలు చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని… కూటమి అధికారంలోకి వస్తే తమ పారితోషకం 10వేలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు రాజీనామాలు చేసి వైసీపీకి సహకరించి ఇబ్బందులకు గురి కాలేమని వాలంటీర్లు ఖరాఖండిగా చెప్తుండటంతో ఏం చేయాలో వైసీపీ నేతలకు పాలుపోవడం లేదని టాక్. ప్రచారంలో సహకరించేందుకు రాజీనామాలు చేయాలని వాలంటీర్లను స్వయంగా వైసీపీ అభ్యర్థులు కోరుతున్నా పాజిటివ్ రియాక్షన్ ఉండటం లేదని తెలుస్తోంది.