‘ ఏం పర్వాలేదమ్మా… సంచి చినిగిపోయినా పర్వాలేదు.. ఏం టెన్షన్ పడకు కలిసి కుట్టుకుందాం.. బియ్యం అంతా వాళ్ల సంచిలో పోసేసి.. మన సంచి మాత్రం పట్టుకొచ్చెయ్.. .. మళ్లీ వాడుకుందాం..!” ఇది వాలంటీర్లకు ఏపీ పౌరసరసఫరా శాఖ అధికారులు తాజాగా ఇచ్చిన ఆదేశం. ఇలా ఎందుకు చెబుతున్నారంటే.. ఏపీ సర్కార్.. ఇంటింటికి బియ్యం అనే పథకం ఒకటి ప్రవేశ పెడుతోంది. ఒకప్పుడు సన్నబియ్యం అన్నారు కానీ.. తర్వాత దాన్ని “నీ అమ్మ మొగుడు చెప్పాడా..?” అని ఎదురుదాడి చేసి.. నాణ్యమైన బియ్యంగామార్పు చేశారు. ఆ నాణ్యమైన బియ్యాన్ని ఇంటింటికి .. రేషన్ కార్డు ఉన్న వారందరికీ వాలంటీర్లే తీసుకెళ్లి ఇస్తారు. ఇలా ఇవ్వడం కూడా ఆషామాషీగా కాదు. ఓ డిజైనర్ సంచిలో . ఈ మేరకు డిజైన్లు కూడా అధికారికంగా విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నెలల కిందటే.. పైలట్ ప్రాజెక్టుగా ఈ ఇంటింటికి బియ్యం ను ప్రారంభించారు. కొత్త సంచుల్లో.. ప్రారంభించి.. అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని రాష్ట్ర మొత్తం విస్తరించబోతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రారంభించాల్సి ఉంది. ఇప్పుడు ఆ సంచులు రాష్ట్ర ప్రభుత్వానికి భారమవుతున్నాయి. సంచుల కోసం.. లెక్కలు తీయగా.. ఏడు వందల కోట్లు ఏటా ఖర్చవుతాయని తేలింది. దీంతో అంత సొమ్ము ఇవ్వడం ఇష్టం లేని సర్కార్ సంచులు రీసైకిల్ చేయాలని నిర్ణయించుకుంది. అంటే.. సంచుల్లో బియ్యం.. వాలంటీర్లు లబ్దిదారుల ఇంటి వద్దకు తీసుకెళ్తారు. ఆ బియ్యాన్ని.. వారి గోతాల్లోనో..లేక వారు చూపించిన చోటనే పోసి.. సంచి తీసుకు వస్తారు. ఆ సంచిలో మళ్లీ బియ్యం పోసి.. ఇతర లబ్దిదారుల వద్దకు తీసుకెళ్తారు. అంటే.. ఒక్క సంచితోనే పలువురి వద్దకు తీసుకెళ్తారన్నమాట.
గతంలో రేషన్ కార్డు దారులు.. తమ కార్డు తీసుకుని రేషన్ షాపుకు వెళ్లేవారు. వారితో పాటు ఓ సంచి తీసుకెళ్లేవారు. బియ్యం తెచ్చుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం మీకు అలాంటి బాదలేమీ వద్దు.. సంచిలో చక్కగా ప్యాకింగ్ చేసి ఇస్తామని గొప్పలు పోయింది. ఆ భారం భరించడం కష్టమని.. ఇప్పుడు రివర్స్ అవుతోంది. కానీ అసలు కష్టాలు మాత్రం వాలంటీర్లకే. ఎందుకంటే.. పనిమాలా…సంచుల్లో పోసుకోని.. మళ్లీ.. లబ్దిదారుల ఇంట్లో పోసి సంచి జాగ్రత్త చేయాలి. ఎంత రీసైకిల్ చేసినా.. అలాంటి గోతాలు.. రెండు, మూడు వాడకాలకు చిరిగిపోతాయి.