జగన్ రెడ్డి తప్పుడు రాజకీయాలకు లక్షల మంది వాలంటీర్ల జీవితం బుగ్గి అయిపోయింది. పదేళ్ల పాటు వారి జీవితాన్ని తీసుకున్న జగన్ తమ పార్టీ కోసం పని చేయించుకుని వారికి ఎలాంటి జాబ్ సెక్యూరిటీ లేకుండా చేశారు. ప్రజాధనం ఇస్తున్నందుకు కనీసం వారిని పద్దతిగా అయినా ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. వారినే లీడర్లుగా చేస్తామని ఆశ పెట్టి ఓటర్లను బెదిరించి పబ్బం గడుపుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో లక్షల మంది యువత జీవితాలను నాశనం చేస్తున్నామని తెలిసినా పట్టించుకోలేదు.
పాతికేళ్లు దాటిన యువత అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడేందుకు సిద్దంగా ఉంటారు. అలాంటి వారిని ప్రభుత్వాలు ఎలా ఉపయోగించుకుని పైకి తీసుకు రావాలా అని ఆలోచిస్తాయి. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. కానీ జగన్ రెడ్డి మాత్రం అత్యంత స్వార్థపూరితంగా ఆలోచించారు. కనీసం ఐదు లక్షల మందిని తన పార్టీకి బానిసలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ఐదు వేలతో. ఐదు వేలతో వాలంటీర్లు అని ఆశ పెట్టి.. భవిష్యత్ లో ఎంతైనా సంపాదించుకోవచ్చని మభ్య పెట్టి వారిని రంగంలోకి దించారు.
పదేళ్ల పాటు వారి జీవితం ఎదుగూబొదుకూ లేకుండా పోగా.. వారిపై పార్టీముద్ర పడింది. ప్రభుత్వం మారితే ఆ వాలంటీర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని తెలిసినా కూడా తగ్గలేదు. చివరికి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా సగం మందితో రాజీనామా లు చేయించారు. ఇప్పుడు వారు రాజీనామాలు చేయకుండా.. తటస్థంగా ఉండి ఉంటే వారి బలం మరింత పెరిగేది.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు.
ఇప్పటికైనా జగన్ కు మించిపోయిదేమీ లేదు. తన వాలంటీర్లను తన వాళ్లేనని క్లెయిమ్ చేసుకుని వారికి పార్టీ తరపున జీతం ఇచ్చి తమ పార్టీ పనులు చేయించుకుంటే బెటర్. వారిని అడ్డం పెట్టుకుని తన సాక్షి పత్రికకు వందల కోట్లు మళ్లించుకున్న ఆయనకు ఇప్పుడు వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం పెద్ద విషయం కాదు. ఆదుకోవాలని మనసులో ఉంటే చాలు.