ఓటుకి నోటు కేసులో నోటీసుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో విచారణ నిమిత్తం నారా లోకేష్ కారు డ్రైవర్ కొండల రెడ్డిని రేపు తమ ముందు హాజరుకమ్మని ఆదేశిస్తూ సెక్షన్ 160 క్రింద ఎసిబి అధికారులు నోటీసు ఇచ్చారు. తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే తాము రెండడుగులు ముందుకు వేస్తామని ఆంద్రప్రదేశ్ మంత్రులు ముందే హెచ్చరించారు. ఎసిబి అధికారులు చేసిన హడావుడికి ఏపీ ప్రభుత్వం కూడా అదే రీతిలో స్పందించింది. ఏపీ సి.ఐ.డి.పోలీసులు కూడా ఓటుకి నోటు కేసులో తెలంగాణా పంచాయితీ శాఖ మంత్రి కె.తారక రామారావు డ్రైవర్ కి, గన్ మెన్ కి మరికొద్ది సేపటిలో నోటీసులు ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని చెప్పమని తనను కొందరు తెరాస నేతలు బెదించారని మత్తయ్య పిర్యాదు చేసాడు. అతనికి వారిద్దరి ఫోన్ల నుండే తరచు బెదిరింపులు వచ్చేవని మత్తయ్య చేసిన పిర్యాదుని ఆధారంగా చేసుకొని ఏపీ సిఐడి పోలీసులు వారికి నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.