సరిగ్గా మూడేళ్ల కిందట, అంటే మే 31, 2015… టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తమకు మద్దతు పలకాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ కు రూ. 50 లక్షల లంచం ఇవ్వజూపారన్నది ఆయనపై అభియోగం. ఆ బేరసారాలకు సంబంధించి వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ‘ఓటుకు నోటు’ కేసు రాజకీయంగా సంచలనమైంది. స్టీవెన్సన్ తో ఫోన్ లో చంద్రబాబు సంభాషణలు జరిపారనే అభియోగంతో ఒక ఆడియో టేపు కూడా బయటకి వచ్చి మరో సంచలనం సృష్టించింది. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సవాళ్లూ ప్రతిసవాళ్లతో వాతావరణం బాగా వేడెక్కింది.
ఆ తరువాత, రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఈ కేసు ఎఫ్.ఐ.ఆర్.లో చంద్రబాబు పేరు 52 సార్లు ప్రస్థావించినా, ఛార్జిషీటులో ఏసీబీ ఎందుకు చేర్చలేదంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. సీఎంపై విచారణ జరపాలో వద్దో అనేది ఏసీబీ తేల్చుతుందని ఆ పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఆ తరువాత, జరూసలెం మత్తయ్య బయటకి వచ్చి, సుప్రీం కోర్టులో గత ఏడాది నవంబర్ లో ఓ కేసు వేశారు.ఈ కేసు నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నాననీ, భద్రత కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోరింది. ఈ ఏడాది వేసవి సెలవుల్లోగా దాన్ని దాఖలు చేయాల్సి ఉంది. దీంతో తాజాగా ఈ కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షించారు! ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం… టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతు అని నిర్ధరణ అయిందని ప్రభుత్వం ధ్రువీకరించబోతోందన్నారు. ఇంకేముంది, వెంటనే చర్చలుంటాయనీ ఈ మధ్య కథనాలు వచ్చాయి. ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. దీని పురోగతి తీరు ఇది.
ఇక, రాజకీయంగా ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనమైంది. మరీ ముఖ్యంగా ఈ మూడేళ్లలో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ప్రభావితం చేసిన అంశం ఇది. ఈ కేసు తరువాత, తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు యాక్టివ్ గా పాల్గొనడం తగ్గింది.ఆ వెంటనే వచ్చిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో క్రియాశీలంగా టీడీపీ వ్యవహరించలేక పోయింది. ఆ తరువాత, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు తెలంగాణలో ఇతర జిల్లాలకు వెళ్లిన దాఖలాలు లేవు. నారా లోకేష్ కూడా దశలవారీగా తెలంగాణ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని, ఏపీ రాజకీయాలకే పరిమితం అయిపోయారు.
రాష్ట్రం విడిపోయాక.. హైదరాబాద్ లో పదేళ్లపాటు ఉండి, తెలంగాణలో టీడీపీని గెలిపించే వరకూ ఆంధ్రాకి వెళ్లనని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. ఈ కేసు తరువాత, చంద్రబాబు కూడా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. అప్పుడప్పడూ పార్టీ నేతలతో సమావేశాలే తప్ప, ఏపీ వ్యవహారాలు దాటి సమయం కేటాయించ లేకపోయారు. ఇప్పటికీ కేటాయించలేకపోతున్నారు.
ఈ కేసు ప్రభావం ఏపీలో టీడీపీపై కూడా ఉంది. ప్రతిపక్షాలు విమర్శలకు ఇదే కీలక అస్త్రంగా మారింది. ఈ కేసు నేపథ్యంలో పనిచేసిన ఒత్తిళ్ల వల్లనే కేంద్రానికి చంద్రబాబు లొంగిపోయారనీ, హైదరాబాద్ నుంచి హుటాహుటిన విజయవాడకు మకాం మార్చేశారనీ విపక్షాలు విమర్శించిన సంగతీ తెలిసిందే. ఓటుకు నోటులో ప్రధాన నిందింతుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఇటీవలే పార్టీని వదిలేసి, కాంగ్రెస్ లో చేరారు. ఒక ఎమ్మెల్సీ పదవి కోసం అత్యాశకు పోవడం వల్లనే టీడీపీ పరిస్థితి ఇలా మారిందని విమర్శించినవాళ్లూ లేకపోలేదు! మొత్తానికి, తెలుగుదేశం పార్టీని బాగా కుదిపేసిన కేసు ఇదీ అనొచ్చు.