ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త కాన్సెప్ట్ ను అమలు చేస్తోంది. ఇటీవల ఎక్కడ ఉన్నా… సొంత నియోజకవర్గంలో ఓటు వేసేలా చూస్తామంటూ రిమోట్ ఓటింగ్ మెషిన్లను టెస్టింగ్ చేసి విమర్శలు రావడంతో ఇప్పుడే కాదు అంటూ వెనక్కి తగ్గిన ప్రభుత్వం తాజాగా.. ఓటు ఫ్రం హోంను అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీనిపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారో లేదో స్పష్టత లేదు.
కర్ణాటక లో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. 224 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నారు. ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న పోలింగ్.. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్నికల్పించారు. 80ఏళ్లు దాటిన వారికి ఈ అవకాశం లభిస్తుంది. దివ్యాంగులకు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశముంది.
80 ఏళ్లు పైబడిన వారు.. దివ్యాంగులు పోలింగ్ కు ఐదు రోజుల ముందే ఫారం 12 D కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం బృందాలు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా..? కాదా..? అనేది సరి చూసుకుంటారు. అర్హులు అని నిర్థారించుకున్న తర్వాతే.. పోలింగ్ జరిగే రోజు ఫారం 12D తీసుకుని.. ఎన్నికల సిబ్బంది వారి ఇంటికే వెళ్తారు. బ్యాలెట్ పేపర్ వారికి ఇచ్చి ఓటు వేయిస్తారు. ఓటు వేసే సమయంలో పక్కన ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో సైతం తీస్తారు. పోలింగ్ బూత్ లో ఎలాంటి ప్రక్రియ అయితే జరుగుతుందో.. అదే తరహాలోనూ ఇంట్లోనే వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఈసీ చెబుతోంది.
కానీ బరి తెగించిన రాజకీయ పార్టీలకు ఇలాంటి అవకాశాలు ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసు. వీరిని ఈసీ సమర్థంగా కట్టడి చేస్తే ఈ అవకాశం దుర్వినియోగం కాకుండా ఉంటుంది.