వైసీపీని గెలిపించడానిక సుపారీ తీసుకున్న ఐ ప్యాక్ కు ఇప్పుడు ఆ చాలెంజ్ సవాల్‌గా మారింది. వైసీపీ కోర్ ఓటు బ్యాంక్ గా ఉన్న వారంతా దూరమయ్యారని తేల్చింది. ఇప్పుడు వారందర్నీ ఎలా దగ్గరకు తీసుకోవాలో అర్థం కాక… జయహో అంటూ పొగడ్తలు అందుకుంటోంది. దీనికి సంబంధించి ఇటీవల వరుసగా ఎస్సీ, బీసీల కోసం ప్రత్యేకంగా జయహో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీలో ఓ మాదిరి పదవులు పొందిన వారిని పిలిపించుకుని తమ కులానికి జగన్ ఎంతో చేశారని పొగిడించుకోవడం.. టీడీపీపై విమర్శలు చేయడం ఈ సమావేశాల ఉద్దేశం.
జయహో ఎస్సీ పేరుతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఏం జరిగిందో బయటకు వచ్చింది. అసలు అందరికీ ఇచ్చే పథకాలు తప్ప.. ఇక ఎస్సీలకు ఏం చేశారని సమావేశానికి వచ్చిన సొంత లీడర్లు మండిపడ్డారు. సబ్ ప్లాన్ నిధులూ ఇవ్వలేదన్న అసంతృప్తి ఎస్సీల్లో ఉందని నేరుగానే హైకమాండ్ కు చెప్పారు. కానీ అలా చెప్పడానికి సమావేశం పెట్టలేదని.. పొగడటానికే పెట్టామని క్లారిటీ ఇచ్చి…. గొప్పగా పొగిడించుకుని చంద్రబాబును తిట్టించి అదే మీడియాకు చెప్పి.. సంతోషపడ్డారు. కానీ ఎస్సీల్లో ఎంత అసంతృప్తి ఉందో.. తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
తాజాగా బీసీ కులాలపైనా అదే ప్రయోగిస్తున్నారు. గతంలో జయహో బీసీ అని నిర్వహించారు. కానీ ఏ ఒక్క బీసీ వర్గానికీ ప్రత్యేకంగా చేసిన మేలేంటో చెప్పుకోలేదు. అదో విందు సమావేశంలా నిర్వహించి జగన్ ను పొగిడేసి వెళ్లిపోయారు. బీసీ కార్పొరేషన్లకు ఒక్క పైసా కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. పథకాల డబ్బులు మాత్రం కార్పొరేషన్ల పేరు మీద ఇస్తున్నట్లుగా చూపించి మోసం చేస్తున్నారు. ఈ అసంతృప్తి అన్ని వర్గాల్లో పేరుకుపోవడంతో ఇప్పుడు జయోహో అంటూ కొత్త కథలు ప్రారంభించారు.
నిజానికి ప్రభుత్వ విధానాల వల్ల దారుణంగా నష్టపోయిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు. వారికి ఉపాధి కరువైపోయింది. అలాంటి వారు కనీస ఆదాయాన్ని కోల్పోయి.. నిరుపేదలుగా మారుతున్నారు. ఏదో ఓ పని చేసుకుని గౌరవంగా బతుకుతున్న వారి కుటుంబాలు ఇప్పుడు రేషన్ బియ్యం కోసం… ప్రభుత్వం ఇచ్చే పథకాల డబ్బుల కోసం ఎదురు చూసేలా చేశారు. ఇక తామే దిక్కన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడుతోంది. తమ బతుకుల్ని దుర్భరం చేసిన వ్యవహారంపై వారంతా రగిలిపోతున్నారు. అలాంటి వారితో పొగడ్తలు కురిపించడం ద్వారా నిప్పులపై దుప్పటి కప్పాలని ఐ ప్యాక్ చూస్తోంది.