నకిలీ ఓటరు కార్డులను నిరోధించడం కోసం ఓటర్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయనుంది. దీనికి సంబంధించిన బిల్లుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇక్కడా చిత్తశుద్ధితో లేదు. పూర్తి స్థాయిలో ఆధార్‌తో లింక్ చేయాడనికి ఇష్టపడటం లేదు. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ అనేది స్వచ్ఛందం అనే నిబంధన పెట్టింది. ప్రజలు ఇష్టమైతే లింక్ చేసుకోవచ్చు. లేకపోతే లేదని చెబుతోంది.
ఒకే వ్యక్తి పేర వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఓటరు కార్డులు ఉండటంపై చాలా కాలం క్రితమే ఎన్నికల సంఘం దృష్టిసారించింది. బోగస్ కార్డుల నిరోధానికి ఓటర్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. అప్పట్లో కొంత వరకూ ఓటర్ కార్డులో ఆధార్ కార్డులు లింక్ చేశారు. అయితే అప్పట్లో సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయకుండా ఆధార్ నంబర్లు సేకరించడానికి ఈసీకి అధికారం లేదని స్పష్టం చేసింది. దీంతో చట్ట సవరణ చేయాలని కేంద్రప్రభుత్వానికి ఈసీ ప్రతిపాదించింది. ఈ కారణంగానే తాజా బిల్లు తెచ్చారు.
ఓటర్ కార్డుతో అనుసంధానం సగం మంది చేసుకుని.. సగం మంది చేసుకోకపోతే.. గందరగోళం ఏర్పడుతుంది. మొత్తంగా ఒకే విధానం ఉంటే.. ఎన్నికల అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇప్పటికే జరుగుతున్న ఎన్నికల్లో దొంగ ఓటర్ల ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఆధార్ కార్డుతో లింక్ చేయడమే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. కానీ నిర్బంధం చేయకుండా ఎందుకు స్వచ్చందం అంటున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. లింక్ చేసుకోని ఓటర్లే .. ఫలితాలను తేల్చేసే పరిస్థితి మన దేశంలో ఉంటుంది. ఏ పని చేసినా పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.