తెలుగు360 రేటింగ్: 2/5
‘భారతీయుడు’ తరవాత లంచం గురించి చాలా సినిమాలొచ్చాయి.
కానీ ‘భారతీయుడు’ తప్ప ఇంకేం గుర్తుండవు.
స్నేహం గురించి చాలామంది చెప్పారు
కానీ ‘దళపతి’ మాత్రం బలంగా ముద్రించుకుపోయింది
పోలీస్ కథలు చాలా చూశాం
కానీ ‘అంకుశం’లా ఉంటే బాగుంటుంది అని ఇప్పటికీ అనుకుంటాం.
కొన్ని కథలు అంతే. కొన్ని ఆలోచనలు అంతే. కొడితే బలంగా కొట్టేస్తాయి. వాటిని చూపించిన విధానంలోనో, తీసిన పద్ధతిలోనో, ఆ హీరోల్లోనో ఉండే స్టామినా అది. ఏదైనా ఓ విషయం చెప్పాలంటే స్టామినా కావాలి. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కేవలం పాయింటొక్కటి పట్టుకుని, బల్లలు గుద్దేసినంత మాత్రాన గొప్ప సినిమాలు పుట్టేయవు అని చెప్పడానికి ‘ఓటర్’ ఓ ఉదాహరణగా మిగిలిపోతుంది.
ఓటు హక్కు గొప్పది – రాజకీయ నేతలతో పనిచేయించుకోవడం మన హక్కు – చేయించకపోతే వాడ్ని పదవిలోంకి ‘రీకాల్’ చేయాలి – అంటూ ఇది వరకు రచ్చ బండల దగ్గర గొంతులు అరిగే వరకూ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫేస్ బుక్కుల్లో చేతులు నొప్పట్టేలా పోస్టింగులు చేసుకుంటున్నాం. అదే పాయింటు పట్టుకుని సినిమా తీస్తాననడం బాగుంటుంది. కానీ ఆ పాయింటుని జనాల్లో ఇంజెక్ట్ చేసేంత దమ్ము నువ్వు రాసుకున్న సన్నివేశాల్లో కనిపిస్తుందా అని ప్రశ్నించుకుంటే ఓటర్ లాంటి కథలు స్ర్కిప్టు దశలోనే ఆగిపోతాయి.
కథలోకి వెళ్తాం. అనగనగా ఓ హీరో. తను మంచోడు. పైగా దేశ భక్తుడు. ఎక్కడో అమెరికాలో ఉంటాడు. అమ్మానాన్న ఫోన్లు చేసి బతిమాలినా రానివాడు.. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇండియాకి వస్తాడు. ఓటేసి ఊరుకోడు. గెలిచిన నాయకుడు తను ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేర్చుకునేంత వరకూ… వదిలిపెట్టడు. ఎం.ఎల్.ఏతో తన పనులన్నీ అయిపోతాయి. కేంద్ర మంత్రితో ఓ గొడవ వస్తుంది. ‘నేను ఓటర్ని.. నిన్ను పదవిలోంచి దింపేస్తా చూడు’ అని సవాల్ విసురుతాడు. అనుకున్నట్టే పదవి నుంచి దింపేస్తాడు. అదెలా..?? అన్నదే ఓటర్ కథ.
ఇలాంటి కథలు సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్పేసుకుంటున్నప్పుడు ‘బాగానే ఉందే’ అనిపిస్తుంది. అయితే… సినిమాలు తీయడానికి అదొక్కటే సరిపోదు. లైన్‌తో పాటుగా చాలా కావాలి. కథలోంచి బలమైన సన్నివేశాలు పుట్టుకురావాలి. ఎమోషన్ పండాలి. హీరో లక్ష్యం, ప్రేక్షకుల లక్ష్యం ఒక్కటై ఉండాలి. సన్నివేశాలు కన్వియన్స్ కోసం రాసుకోకూడదు. కన్వెక్షన్‌తో రాసుకోవాలి. అయితే అవన్నీ ఒకొక్కటిగా ‘ఓటర్’లో పల్టీలు కొడుతూ ఉంటాయి. హీరో అమెరికా నుంచి రావడం ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం, ఎం.ఎల్.ఏతో పనులు చేయించుకోవడం వరకూ ఓకే. అయితే అది ఓ అమ్మాయి ప్రేమ కోసం అన్న పాయింటే కరెక్ట్ కాదు. హీరోలో నిజాయతీ ఉందనుకుంటే, ఈ దేశం గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నాడనుకుంటే, స్వతహాగానే.. ఎం.ఎల్.ఏని ఎదిరించి పనులు చేయించుకోవాలి.
పోనీ.. కథానాయిక పాత్రకీ ఏదో ఓ పని పడాలి కదా అని దర్శకుడు ఈ కథని అలా రాసుకున్నాడనుకుందాం. ఆ పనులు చేయించుకున్న పద్ధతి, అందుకోసం హీరో వేసిన ప్లాను.. మరీ సిల్లీగా అనిపిస్తాయి. ఓ వీడియో తీసి, ఎం.ఎల్.ఏ ని బ్లాక్ మెయిల్ చేసి, అతనితో పనులు చేయించుకోవడంలో హీరోయిజం ఎక్కడుంది? దానికి బదులు తన తెలివితేటలు వాడి – ఎం.ఎల్.ఏని తన దారిలోకి తెచ్చుకుంటే బాగుండేది. పైగా ఆ సన్నివేశాలన్నీ ఏదో టైమ్ పాస్‌కి రాసుకున్నట్టు ఉంటాయి తప్ప, వాటిలో సీరియెస్నెస్ కనిపించదు. ‘నేను నీకు ఓటు వేశాను కాబట్టి నువ్వు నా పనులన్నీ చేయాలి’ అని కథానాయకుడు ఎం.ఎల్.ఏని నిలదీశాడు. ఓకే. అయితే… ఎంపీకీ కథానాయకుడికీ ఏం పని? ఎంపీకి ఓటు వేయాలని కథానాయకుడు అమెరికా నుంచి ఇండియాకి రాలేదే..? మరి అలాంటప్పుడు ప్రజా ప్రతినిధిని నిలదీసే అధికారం ఆ ఓటరుకి ఎక్కడుంది? ఇంత చిన్న లాజిక్‌ని దర్శకుడు మర్చిపోయాడు. నిజానికి ఎంపీకి ఓటు వేయడానికే హీరో అమెరికా నుంచి వచ్చి ఉంటే – ఈ లాజిక్ తీయాల్సిన అవసరం వచ్చేది కాదు. రీకాల్ అనేది ఇప్పుడు పుట్టిన పాయింట్ కాదు. ఎప్పటి నుంచో మేధావి వర్గం దీనిపై పోరాడుతూనే ఉంది. అదేదో కథానాయకుడిలో కొత్తగా పురుడు పోసుకున్న ఐడియా అన్నట్టు, ఒక్క వీడియో పడడంతోనే సోషల్ మీడియా షేకైపోయి, దేశం అట్టుడికి పోయి, సుప్రీంకోర్డు డంగైపోయినట్టు చూపించారు. ఇలాంటి వీడియోలతోనే రాజ్యాంగాలు మారిపోతే – మన రాజ్యాంగంలో ప్రతీ గంటకూ ఓ సవరణ వచ్చి పడుతుండేది. సన్నివేశాల్లో డొల్లతనం అడుగడుగునా కనిపిస్తూ ఓటరు లక్ష్యానికి తూట్లు పొడిచేలా సాగిందీ చిత్రం.
ఇలాంటి కథలో ఎంతమంది స్టార్లున్నా ఏం లాభం? మంచు విష్ణు కూడా చేయగలిగిందేం లేదు. నిలబడి కాస్త డైలాగులు చెప్పాడంతే. అయితే ప్రతీ డైలాగ్‌కీ ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఒకేలా ఉంటుందనుకోండి. అది వేరే విషయం. సురభికి మేకప్ ఎక్కువైందో, నిజంగానే అలా కనిపిస్తుందో, లేదంటే డీఐ చేయలేదో అర్థం కాదు గానీ – తెల్లమొహం వేసుకుని నిలబడింది. సంపత్ రాజ్ రొటీన్ విలనీతో మరోసారి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. సాంకేతికంగా మెరుపులేం లేవు. పాటలు రాంగ్ ప్లేస్మెంట్. `ఈ అమ్మాయి ప్రాణాల్ని కాపాడా` అని హీరోయిన్ ఎమోషనల్‌గా చెప్పగానే – బీచ్‌లో అరకొర దుస్తులతో ఓ పాట మొదలైపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంత సెక్సీ పాట బహుశా.. టాలీవుడ్ చరిత్రలోనే ఎవరూ ప్లేస్ చేయలేదేమో.
ఫైనల్‌గా.. శంకర్ స్థాయిలో ఊహించుకుని అనుకున్న పాయింట్‌ని షకలక శంకర్ చేతిలో పెట్టినట్టు అయిపోయిందీ సినిమా. ఆశయాలు, వాటి వెనుక ఉద్దేశ్యాలూ మంచివే. కానీ.. తెరపై తర్జుమా చేయడంలో మాత్రం టీమ్ మొత్తం దారుణంగా విఫలమైంది. ఎక్కడైనా ఓటు గల్లంతవుతుంది.. ఇక్కడ మాత్రం ఓటరే గల్లంతయ్యాడు
ఫైనల్ టచ్: డిపాజిట్లు దక్కలేదు
తెలుగు360 రేటింగ్: 2/5