టీచర్,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘోరంగా ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ టీచర్ ఎమ్మెల్సీలు పూల రవీందర్, సుధాకర్ రెడ్డి ఓడిపోయారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. 2013లో జరిగిన ఎన్నికల్లో పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయన టిఆర్ఎస్ అభ్యర్థి వరదారెడ్డి పై విజయం సాధించారు. గెలిచిన తర్వాత పూల రవీందర్ కూడా టిఆర్ఎస్ లో చేరి పోయారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల్లో నిలిచారు. పీఆర్టీయూ కూడా పూల రవీందర్కే మద్దతు పలికింది. కానీ పీఆర్టీయూ అధ్యక్షుడిగా ఉన్న సరోత్తం రెడ్డి రెబెల్ గా బరిలో నిలిచారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో యూటీఫ్ బలపర్చిన నర్సిరెడ్డి చేతిలో రెండు వేలకు పైగా ఓట్ల తో ఓడారు. ఇద్దరి ఓట్ల చీలిక, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణంగా ఓటమి పాలయ్యామని పూల రవీందర్ సన్నిహితులు చెబుతున్నారు.
టిఆర్ఎస్ కంచుకోట కరీంనగర్ టీచర్స్ స్థానంలోనూ ఓటమి ఎదురైంది. అక్కడ టిఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఉద్యమ సమయంలో పీఆర్టీయూను చీల్చి టిఆర్ఎస్కు మద్దతుగా టిఆర్టీయూను ఏర్పాటు చేశారు. అప్పుడు టీఆర్ఎస్ మద్దతుతో పాతూరి సుధాకర్ రెడ్డి గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా మరోసారి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఈ స్థానంలో పీఆర్టీయూ బలపర్చిన రఘోత్తమ్ రెడ్డి విజయం సాధించారు. టిఆర్ఎస్ కోటలో ఆ పార్టీ బలపర్చిన సుధాకర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణా లో జరిగిన ఒకే ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ కు ఓటమి ఎదురైంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి విజయం సాధించారు. టిఆర్ఎస్ మద్దతు తో బరిలో నిలిచిన చంద్రశేఖర్ గౌడ్ మూడో స్థానంలో నిలిచారు.
కరీంనగర్, మెదక్ నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాలు టిఆర్ఎస్ కు గట్టి పట్టున్న ప్రాంతాలు.సీఎం సొంత జిల్లా మెదక్ లో కూడా విద్యావంతులు టిఆర్ఎస్ అభ్యర్థి కి వ్యతిరేకంగా ఓటు వేశారు. టీచర్లు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. టిఆర్ఎస్ మద్దతు తో గెలిచిన మండలి చైర్మన్ స్వామి గౌడ్ స్థానంలో కూడా నేరుగా పోటీ చేయడానికి సాహసించ లేదు. మూడు నెలల్లోనే పరిస్థితి మారిపోయిందన్న చర్చ తెలంగాణలో ప్రారంభమయింది.