భారత ప్రజాస్వామ్య పతనం అత్యంత కీలక దశకు చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓటర్లు తమకు రాజకీయ పార్టీలు డబ్బులివ్వలేదని ధర్నాకు దిగుతున్నారు. హుజురాబాద్లో అడుగడుగునా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక పార్టీ ఇస్తే కాదు.. బరిలో ఉన్న మూడు పార్టీలు తమకు డబ్బులివ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. హుజురాబాద్లో ఒక్కో ఓటుకు రూ. ఆరు వేల వరకూ రాజకీయ పార్టీలు పంచుతున్నాయి. ఒక్క ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఇరవై నాలుగు వేల రూపాయలు వారి ఇంటికి వస్తున్నాయి.
అది ఒక్క పార్టీ ఇస్తే.. రెండో పార్టీ కూడా ఇస్తే నలభై ఎనిమిది వేలు చేతిలో పడతాయి. అంత కంటే కావాల్సింది ఏముందని ఓటర్లు ధర్నాలకు దిగుతున్నారు. ఏదో ఓ పార్టీ ఇచ్చి వెళ్లిపోతే కాదని.. రెండు పార్టీలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమకు నమ్మకంగా ఓటు వేస్తారని నమ్మిన వారికే పార్టీలు డబ్బులు పంచుతున్నాయి. ఓటు వేయరని అనుకున్న వారికి ఇవ్వడం లేదు. వారికి ఇచ్చి .మాకు ఎందుకు ఇవ్వడం లేదని డబ్బులు అందని వారుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితి చూసి రాజకీయ పార్టీలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ఓటుకు ఒకప్పుడు రూ. వెయ్యి ఇస్తేనే గొప్ప. నంద్యాల ఉపఎన్నికల్లో రూ. ఐదు వేలు ఇచ్చారని చెప్పుకున్నారు. ఇప్పుడు హుజురాబాద్లో అది రూ. ఆరు వేలు అయింది. ఇవ్వకపోతే ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ముందు మందు ఈ పరిస్థితి కొనసాగితే … ప్రజాస్వామ్యం అమ్మకానికి . కొనుగోలుకు మధ్య ఊగిసలాడటం ఖాయమని చెప్పుకోవచ్చు.