ఓటర్లను ఎవరూ తక్కువ అంచనా వేయకూడదు. అది అధికారపక్షం అయినా.. విపక్షం అయినా.. మున్సిపల్ ఎన్నికల్లో అదే తేలింది. స్థానిక ఎన్నికలకు రాష్ట్ర స్థాయి అంశాలకు ముడిపెట్టి… ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేద్దామనుకున్న విపక్ష పార్టీలకు.. గట్టిగా షాక్ ఇచ్చారు. తమ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు.. తమ డ్రైనేజీ సమస్య… తమ ప్రభుత్వ పథకాల గురించి మాత్రమే వారు ఆలోచించారు. ఇవి ఆ ఓట్లుగానే భావించారు. అదే ఎజెండాతో ఓటింగ్ చేశారు. ఫలితంగా.. రాజధాని, స్టీల్ ప్లాంట్ .. శాంతిభద్రతలు అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయబోయిన విపక్షాలకు షాకిచ్చినట్లయింది.
రాజధాని సెంటిమెంట్, స్టీల్ ప్లాంట్ ఉద్యమం… శాంతిభద్రతలు ఇలా అనేక అంశాలపై విపక్షాలు ఆసలు పెట్టుకున్నాయి. కానీ ఏపీలోని కార్పొరేషన్ల లో నివాసం ఉంటున్న వారు మాత్రం.. అధికార పార్టీకి పట్టం కడితేనే… అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. ఫలితాలు దానికి తగ్గట్లుగానే వచ్చాయి. రాజధాని సెంటిమెంట్ అంటూ.. విజయవాడ, గుంటూరు ప్రజల్ని ఎమోషనల్ టచ్ చేసేందుకు ప్రయత్నించడం.. విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో.. అక్కడ ఓటర్లను టార్గెట్ చేయడంతో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారా అన్న ఆసక్తి రాష్ట్రమంతటా ఏర్పడింది. అయితే ఎన్నికల ఫలితాల్లో.. అధికార పార్టీకే మొగ్గు కనిపించింది. రాష్ట్ర స్థాయి అంశాలకు కార్పొరేషన్ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ముడి పెట్టినా.. ప్రజలు మాత్రం.. స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు.
నగర ప్రజలు స్థానిక ఎన్నికలను స్థానిక ఎన్నికలుగానే చూశారు. రాష్ట్ర అంశాలకు తమ ఓటింగ్లో ప్రయారిటీ కల్పించలేదు. అధికార పార్టీకి ఓటు వేస్తే.. సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవడంతో పాటు.. తమ వార్డులో అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని జనం ఆశించారు. ఆ విషయం ఫలితాల సరళితో తేలిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేదు… ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ.. అధికార పార్టీనే కనిపించింది.
స్థానిక ఎన్నికల ఫలితాలు.. అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని… ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందేవారు ఎవరూ అనుకోరు. ఈ సారి అధికార పార్టీ చాలా పక్కాగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులను మ్యాపింగ్ చేసుకుంది. వాలంటీర్ల ద్వారా ఎవరు ఏ పార్టీ ఓటర్లో గుర్తించి.. వారికి వచ్చే పథకాల గురించి ముందుగానే హెచ్చరికలు పంపింది. దీంతో ఏకపక్ష విజయాలు నమోదయ్యాయనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా ఓటర్లే గెలిచారు. స్థానిక ఎన్నికలను స్థానిక ఎన్నికలుగానే చూశారు.