ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జనసేన పొత్తుల వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. తమతో ఒక పార్టీకి పొత్తు కుదిర్చేందుకు తెరాస ప్రయత్నిస్తోందన్నట్టుగా పవన్ చేసిన వ్యాఖ్యలే ఈ కలకలానికి కారణమయ్యాయి. ప్రతిపక్ష పార్టీ వైకాపా నేతలు స్పందిస్తూ… రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామనీ, ఎవరి సహాకారమూ తమకు అవసరం లేదని ఆ పార్టీ నేత పార్థసారధి కొట్టిపారేశారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రికి రిటన్ గిఫ్ట్ ఇవ్వాలన్న ధ్యేయంతో అటు తెరాస కూడా తెర వెనక ప్రయత్నాలు చేస్తోందనే కథనాలున్నాయి. సరే, ఎవరెవరిని కలపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో, ఎందుకు ప్రయత్నిస్తున్నారో ప్రజలకు అర్థంకాని అంశమైతే కాదు. కానీ, జనసేనకు సంబంధించినంత వరకూ వైకాపాకి స్పష్టత రాని ఒక అంశం ఉందనే గుసగుసలు కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉన్నట్టుగా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి…! పవన్ కి సంబంధించి రెండు రకాల విశ్లేషణలు ఆ పార్టీ వర్గాల్లో ఉన్నాయట!
జగన్ ముఖ్యమంత్రి కావాలి, అంటే టీడీపీని ఆంధ్రాలో ఓడించాలి… వైకాపా ధ్యేయం ఇదొక్కటే. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూసుకోవాల్సిన అవసరం వైకాపాకి ఉంది. అయితే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కొంత శాతాన్ని చీల్చే స్థాయి ఉన్నవారెవరూ… జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒక సామాజిక వర్గం ఓట్లతోపాటు… ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కొంత శాతాన్ని జనసేన చీల్చుతుంది అనేది వైకాపా అంచనాగా తెలుస్తోంది. వ్యతిరేక ఓటు చీలిపోయే పరిస్థితి ఉంటే… ఆ మేరకు వైకాపాకి నష్టమే కదా. కాబట్టి, ఎలాగోలా దాన్ని ప్లస్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కొంతమంది వైకాపా నేతల్లో ఉన్నట్టు సమాచారం.
రెండో అభిప్రాయం ఏంటంటే… పవన్ ప్రభావాన్ని జగన్ తమకు అనుకూలమైన అంశంగానే చూస్తున్నారట! ఎలా అంటే… గత ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పవన్ కల్యాణ్ తోడయ్యారనీ, పవన్ కలవడం వల్లనే వైకాపా ఓట్ల కంటే ఒక శాతం ఓట్లు అధికంగా చంద్రబాబుకి పడ్డాయనీ, ఇప్పుడు టీడీపీతో పవన్ పొత్తు తెగిపోయింది కాబట్టి… ఆ మేరకు పవన్ చీల్చబోతున్న ఓట్లు టీడీపీ మద్దతుదారులవే అనేది ఆయన విశ్లేషణట! గతంలో చంద్రబాబుతో పవన్ కలిసి పనిచేశారు కాబట్టి… ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేనకు పడదనేది వారి అభిప్రాయమట. మొత్తానికి, పవన్ చీల్చబోయే ఓట్లు ఏవనేదానిపై వైకాపా వర్గాల్లో ఇలాంటి చర్చ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.