గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో.. తెలంగాణ ఎస్ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి. కౌంటింగ్‌కు ముందు రోజు అర్థరాత్రి ఎస్ఈసీ ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారం.. బ్యాలెట్‌పై ఓటును స్వస్థిక్ గుర్తుతో కాకుండా.. మార్కర్ పెన్నుతో గుర్తించినా… పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే.. ఇతర రాజకీయ పార్టీలను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉన్న వారిని విస్మయానికి గురి చేస్తోంది. విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసుకుని దానికి ఆమోద ముద్ర వేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం వారు విమర్శలు ప్రారంభించారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఈ సారి ఈవీఎంలు వాడలేదు. బ్యాలెట్ బాక్సులు వాడారు. ఈ కారణంగా.. బ్యాలెట్లపై ఓటింగ్ వేయాల్సి వచ్చింది. బ్యాలెట్ ఓటింగ్ విషయంలో ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఓటును ఖచ్చితంగా బ్యాలెట్ పై.. ఎన్నికల అధికారి ఇచ్చే స్వస్థిక్ మార్క్ గుర్తునే వేయాల్సి ఉంటుంది. అది కూడా.. అభ్యర్థి గుర్తుపైనే ఉండాలి. రెండుగుర్తులకు మధ్య ఉండకూడదు. బ్యాలెట్‌పై ఇతర ఏ రాతలు కనిపించినా… అది చెల్లుబాటయ్యే అవకాశం ఉంది. స్వస్థిక్ మార్క్‌తో కాకుండా.. మరో విధంగానూ ఓటును గుర్తించడానికి చాన్స్ లేదు. అయితే.. అనూహ్యంగా మార్కర్ పెన్నుతో ఓటేసినా… సరే.. పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చేశారు.
అసలు మార్కర్ పెన్నుతో ఎవరు ఓటేస్తారు..? ప్రతీ ఓటర్‌కు పోలింగ్ అధికారి ఖచ్చితంగా ఇంకు అద్దిన స్వస్థిక్ మార్క్ ఇస్తారు. దాంతోనే.. ఓటర్ ఓటు వేస్తాడు. మార్కర్ పెన్నుతో ఓటేసే చాన్స్ లేదు. మరి ఎందుకు ఎస్ఈసీ కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసిందో.. ఎవరికీ అర్థం కాని విషయం. పోలింగ్ పర్సంటేజీ అనూహ్యంగా పెరగడం వెనుక రిగ్గింగ్ కారణం ఉందని.. ఆ రిగ్గింగ్‌ను .., పోలింగ్ సిబ్బందితో చేయించుకుని మార్కర్ పెన్నులు వాడారాని.. అందుకే ఈ కొత్త మార్గదర్శకాలు తెచ్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మార్కర్ పెన్నుతో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి.. వాటితో ఎన్నికల ఫలితాలు ఏమైనా తారుమారయ్యాయా అన్నదానిపైనే..ఈ అంశానికి సంబంధించి తదుపరి విాదం చెలరేగే అవకాశం ఉంది.