అసెంబ్లీ ఎన్నికలప్పుడు కనిపించిన ఊపు, ఉత్సాహం… ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణలో కనిపించడం లేదు. ప్రచారంలో ప్రధాన పార్టీల జోష్ కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే తక్కువే ఉంది. అధికార పార్టీ తెరాస గెలుపు ధీమాతో ఉంది. దాంతో ప్రచారంపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సభలకు మాత్రమే పరిమితమయ్యారు. ఉర్రూతలూగించే ప్రసంగాలూ లేవు. కేసీఆర్ మార్క్ ప్రసంగాల్లో తగ్గింది, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న అజెండాతోనే ప్రచారమంతా సాగించారు. కేటీఆర్ మాత్రమే ప్రచారంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, తెరాస ప్రత్యర్థి పక్షాలైనా కాంగ్రెస్ గానీ, భాజపాగానీ ప్రచారాన్ని రక్తికట్టించలేకపోతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో… లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతుందనే అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా నమోదు అయింది. కానీ, లోక్ సభకు ఎన్నికలకు వచ్చేసరికి 50 శాతానికి కాస్త అటోఇటోగా ఓటింగ్ ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉన్నవారిని పెద్ద ఎత్తున స్వస్థానాలకు తరలించడం కోసం తెరాస, కాంగ్రెస్ లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీపడ్డాయి. కానీ, ఇప్పుడా వాతావరణం కనిపించడం లేదు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం కూడా మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతమే ఓటింగ్ జరిగింది. దీన్ని పెంచుతామంటూ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి, ఈ ప్రయత్నం చేయాల్సింది రాజకీయ పార్టీలు.
ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గితే… పార్టీల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది వాస్తవం. గెలుపు ధీమాతో ఉన్న తెరాసకి ఇది సవాల్ కాబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాం కాబట్టి, అదే రిపీట్ అవుతుందన్న ధీమాతో వారున్నారు. కానీ, గత ఎన్నికల్లో ఓట్లు వేసినవారు.. ఈ ఎన్నికలపై ఆసక్తి చూపించకపోతే ఆ మేరకు నష్టం తప్పదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే అన్వయం అవుతుంది. ఓటింగ్ శాతం అనూహ్యంగా తగ్గితే… ఫలితాలు కూడా అలానే ఉండే అవకాశం ఉంది. ఎన్నికలకు మూడు రోజుల మాత్రమే సమయం ఉంది. ఈలోగా ప్రధాన పార్టీలు ఓటింగ్ శాతంపై ద్రుష్టి పెడతాయో లేదో చూడాలి.