పట్టణాల్లో ఓటింగ్ శాతం ప్రతీ సారి తక్కువగా నమోదవుతోంది. ఈ సారి కూడా అలాగే ఉంది. ఎంత ప్రచారం చేసినా ఓటు వేయడానికి ఎవరూ రావడం లేదని బాధపడుతున్నారు. కానీ అసలు సమస్య అది కాదని.. పాతబస్తీ లాంటి కొన్ని చోట్ల ప్రత్యేకమైన కారణాలతో ఓటింగ్ కు దూరంగా ఉంటారు కానీ ఇతర చోట్లా మాత్రం సిటీలో ఉన్న వారంతా మ్యాగ్జిమం ఓటేసిన వాళ్లేనని చెబుతున్నారు. మరి ఓటింగ్ శాతం తక్కువగా ఎందుకు నమోదవుతోందంటే.. ఓటర్ల జాబితాలో తప్పులవల్లేనని చెప్పక తప్పదు.
సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదా..? . తక్కువ ఓటింగ్ నమోదయిందంటే.. ఓటర్లను నిందించడం పరిపాటి అయిది. కానీ.. ఓటర్ల జాబితాలను ఎందుకు చూడరు. నగరంలో ఉన్న వారిలో… ఓటు హక్కు ఉన్న వారిలో దాదాపుగా 70 శాత మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో… ఓ పది మందిని ఓటు వేశారా అని అడిగితే.. ఐదుగురు వేయలేదని చెబుతారు. ఎందుకు వేయలేదంటే.. తమకు ఓటు లేదని చెబుతారు. అంటే.. ఓటు హక్కు ఉండి వినయోగించుకోని వాళ్లు హైదరాబాద్‌లో తక్కువే.
పట్టణాల్లో ఓట్లు ఎక్కువగా డబ్లింగ్ అవుతున్నాయి. సిటీలో ప్రజలు ఓ చోట స్థిరంగా ఉండటం కష్టం. ఇప్పుడు ఎన్నికల్లో ఎల్బీ నగర్ లో ఓటేసిన ఓటర్.. వచ్చే ఎన్నికల నాటికి ఏ నియోజకవర్గంలో ఓటర్ గా ఉంటారో చెప్పలేం. అక్కడ కూడా ఓటు నమోదు చేయించుకుంటాడు. కానీ ఈ ఓటు తీసేయకపోవడం వల్ల అది ఓటు వేయని ఓటర్ జాబితాలో పడిపోతుంది. అంతే కాదు సిటీతో పాటు ఊళ్లలో ఓటు హక్కు ఉన్న వారు కూడా ఎక్కువగా ఉంటారు. తెలంగాణ పల్లెల్లో ఓటు వేయడానికి సిటీల నుంచి పోయిన వారిలో సగం మందికిపైగా సిటీలో ఓటు ఉంటుంది. కానీ తమ నియోజకవర్గంలో ఓటు వేయడానికే ప్రాధాన్యం ఇస్తూ వారు ఊరెళ్లి ఓటు వేశారు.
ఏ విధంగా చూసినా… సరియైన ఓటర్ల జాబితా ఉంటే.. హైదరాబాద్‌లోనూ… 70 శాతం వరకూ పోలింగ్ నమోదవుతుందన్న అంచనాలున్నాయి. అందుకే ఇది.. ఓటర్ల తప్పు కాదు.. వాళ్లకు కావాల్సినంత చైతన్యం ఉంది. అసలు చైతన్యం రావాల్సింది.. ఎన్నికల సంఘం తరపున పని చేసే మేధావుల్లోనే. ఓటర్ల జాబితా పక్కాగా ఉండటమే అసలు కావాల్సింది.