హైదరాబాద్: తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వేదికపై ఉన్నవాళ్ళను వెంకయ్య నాయుడును ఘోరంగా అవమానించారని మాజీ ఎంపీ ఉండవల్లి ఆరోపించారు. ఉండవల్లి ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. చొక్కాలు మార్చినట్లుగా పార్టీలు మార్చేవారు తనను విమర్శించటమా అని వెంకయ్యనాయుడు నాడు అన్ననారని, పార్టీ మారకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ఆయన, మాణిక్యరావుతప్ప వేదికపై చంద్రబాబు, గంటా, కామినేని, కావూరి సహా అందరూ పార్టీలు మార్చినవారేనన్నారు. వేదికపై ఉన్నవాళ్ళనే అవమానించినవారు రాష్ట్రానికేం చేస్తారని ప్రశ్నించారు. నాడు పార్లమెంట్లో తానొక్కడినే పోట్లాడానానని వెంకయ్య చెబుతున్నారని, అది నిజంకాదని ఉండవల్లి చెప్పారు. చిరంజీవి, కేవీపీ బలంగా వ్యతిరేకించారని తెలిపారు. క్యాబినెట్లో మంత్రిగా ఉన్న చిరంజీవి ఇలా ఎదురుతిరగటంపై బీజేపీనేతలే ఆశ్చర్యపోయారని అన్నారు. తెలుగుదేశానికి చెందిన సుజనా చౌదరి, సీఎమ్ రమేష్ కూడా బలంగా వాదించారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ అఘాయిత్యం చేస్తే బీజేపీ ద్రోహం చేసిందని అన్నారు. కాంగ్రెస్ దానికి ప్రతిఫలం అనుభవించిందని చెప్పారు. కాంగ్రెస్కు ఏపీలో ఘోర అవమానం జరిగిందని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, బెస్టాఫ్ లక్ చెప్పారు. విభజన చట్టంలో ఉన్నట్లుగా నిధులు ఇవ్వకపోగా, ఇప్పటివరకు కేంద్రం ఒక్క రూపాయికూడా రాష్ట్రానికి ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ గొంతు కోసిందని, వెంకయ్య లేకపోతే ఏపీ ఏమై ఉండేదని మోడి ఎన్నికలముందు అన్నారని, కానీ బీజేపీ మద్దతుతోనే ఏపీ విభజన జరిగిందని ఉండవల్లి చెప్పారు. వెంకయ్య నాడు రాజ్యసభలో ఎంత ఆవేశంగా వ్యవహరించారో, అంతే ఆవేశంగా, స్ఫూర్తితో ఇప్పుడు వ్యవహరించాలని డిమాండ్ చేశారు.