రాజధానిగా అమరావతిని తరలించడం అసాధ్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కుండబద్దలు కొట్టి చెప్పేశారు. అమరావతినే రాజధానిగా ఉంటుందని.. విశాఖకు తరలించే చాన్స్ లేదంటున్నారు. రాజధానిని తరలించాలని చూసిన ప్రభుత్వాలు కూలిపోయాయని.. పాత ఉదాహరణలు చెబుతున్నారు. రాజధానిగా అమరావతినే ఉంటుందని… ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది… రాజధానికి 33వేల ఎకరాలు అవసరమా కాదా అన్నదానిపైనా చర్చ మాత్రమేనని అంటున్నారు. మంత్రులు చెబుతున్న అమరావతి శ్మశానం.. ఎడారిలా లేదని.. తాను గతంలో చూసినప్పుడు.. చాలా వరకు భవన నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.
ఇటీవలి కాలంలో పెద్దగా మీడియా ముందుకు రాని ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చారు. అందులో… ఇతర అంశాల సంగతేమో కానీ.. అమరావతి గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిని మార్చాలనుకుంటే… అమరావతి సచివాలయం .. క్వార్టర్స్ కట్టాలనుకున్న చోటును మార్చొచ్చు కానీ.. ఏకంగా ప్లేస్‌నే మార్చడం సాధ్యం కాదంటున్నారు. ఉండవల్లి.. చాలా న్యాయపరమైన లాజిక్‌లు చెప్పి ఉండవచ్చు కానీ.. జగన్మోహన్ రెడ్డి పట్టుదల గురించి మాత్రం ఆయన పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్లుగా లేరు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా ఫిక్సయ్యారు. కరోనా వైరస్ అడ్డం పడకపోతే.. ఈ పాటికి అది రాజధాని అయిపోయి ఉండేది. ఎప్పుడు సందు దొరికితే.. అప్పుడు యంత్రాంగాన్ని అక్కడికి తరలించేందుకు చూస్తున్నారు. ఈ సమయంలో..ఉండవల్లి రాజధాని తరలింపు సాధ్యపడని వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. బహుశా… జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టాడనికి కావొచ్చని.. విపక్ష పార్టీల నేతలు అనుమానిస్తున్నారు.