రాష్ట్రం కోసం పోరాడనందునే గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు జగన్ అసలు పోరాడటం లేదని.. ఇప్పటికైనా కేంద్రంపై యుద్దం చేయకపోతే.. జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని మాజీ ఎంపీ, జగన్ శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదనా స్వరంతో మీడియా ముందు వాపోయారు. దీనికి కారణం ఉండవల్లి దాఖలు చేసిన రాష్ట్ర విభజన వ్యతిరేక పిటిషన్ విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడమే.
విభజన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. తెలంగాణ నుంచి ఏపీకి లక్ష కోట్లకుపైగా ఆస్తులు రావాల్సి ఉందని.. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీ నెరవేరలేదని.. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సి.ఎం జగన్ కు భయం ఎందుకున్నారు. జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎ.పికి అన్యాయంపై సి.ఎం జగన్ పోరాటం చేయాలని.. పోరాటం చేయకుంటే జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని హెచ్చరించారు. ఎ.పి.కి అన్యాయంపై పోరాటం చేయకపోవడం చంద్రబాబుకు 23సీట్లు రావడానికి ఒక కారణమని తెలిపారు. మోదీ, జగన్ కు మంచి సంబంధాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
కేంద్రంపై పోరాడితేనే జగన్ రాజకీయ భవిష్యత్‌కు పులిస్టాప్ పడుతుంది.. ఈ చిన్న లాజిక్‌ను ఉండవల్లి మిస్సయ్యారా లేకపోతే కేంద్రంపై పోరాటం ప్రారంభిస్తేనే ప్రజలు ఓట్లేస్తారని లేకపోతే వేయరనే సంకేతాన్ని జగన్‌కు పంపించారా అన్నది ఆయనకే తెలియాలి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్న కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అదే జగన్‌కు అయితే కొత్తగా కేసులు కూడా.. సోదాలు కూడా అవసరం లేదు. పాత కేసుల మీద విచారణ కొనసాగిస్తే చాలు. జగన్ రాజకీయ భవిష్యత్‌కు ముగింపు వచ్చినట్లే. అయినా ఉండవల్లి జగన్నురెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.