మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పాలనపై అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు. వరుసగా యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూ విమర్శలు చేయడమే కాకుండా ప్రెస్మీట్లు కూడా పెడుతున్నారు. శనివారం ప్రెస్మీట్ పెట్టి.. జగన్ పాలన దారుణంగా ఉందని మండిపడ్డారు. ఇంత మంది సలహాదారులు ఏం చేస్తున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ. ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందని లెక్క చెప్పారు. చివరికి తాము వ్యతిరేకించిన అమరావతిని కూడా తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నారని సలహాదారులు ఏం చేస్తున్నారని ఆయన ఆశ్చర్యపోయారు.
అప్పులు ఎక్కడ దొరికితే అక్కడ కనిపించే రాష్ట్రంగా ఏపీ మారిపోయిందని.. కేంద్రం సహా అందరూ చులకనగా చూస్తున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. అప్పుల కోసం కేంద్రం పెట్టిన అడ్డగోలు నిబంధనలన్నీ అమలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్రం తీరును ఉండవల్లి తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రబాబునాయుడు దిగిపోయేటప్పుడు పోలవరం ఎలా ఉందో ఇప్పుడూ అంతే ఉందని కానీ మంత్రులు మాత్రం అత్యుత్సాహంతో ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కనీసం నిధులు కూడా అడిగి తెచ్చుకోలేని పరిస్థితి ఉందన్నారు.
కేసీఆర్తో మంచి సంబంధాలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. చిన్న చిన్న సమస్యలు సెటిల్ అవుతాయనుకున్నా.. కానీ రెండున్నరేళ్లుగా ఏం జరగలేదన్నారు. ఏపీలో జీతాలు ఆలస్యమవుతున్నాయి, ఆస్తులు అమ్ముతున్నారని ఉండవల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొసమెరుపేమిటంటే ఉచిత పథకాలు 2024 ఎన్నికల వరకు ఇవ్వగలిగితే మళ్లీ జగన్ గెలుస్తారని జోస్యం చెప్పారు.