జగన్ రెడ్డి తప్పు చేస్తున్నారని దిద్దుకోవాలని ఉచిత సలహాలతో ఉండవల్లి అరుణ్ కమార్ మీడియా ముందుకు వచ్చేశారు. కొన్నాళ్లుగా ఆయన మాట్లాడటం లేదు .కానీ జగన్ రెడ్డి తన కొంపను తాను తగులబెట్టుకుంటున్నారన్న డౌట్ రావడంతో ఆయన ముందుకు వచ్చేశారు. ఎమ్మెల్యేలను మార్చే ప్రక్రియ సరిగ్గా లేదని.. సీట్ల మార్పుపై సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. టికెట్లు మార్చడం చాలా కష్టమైన పని.. సీఎం చేయాలని సోనియాను అడిగినప్పుడు జగన్కు ఎదురైన ఫీలింగే ఎమ్మెల్యేల్లోనూ ఉందన్నారు. సీట్ల మార్పుతోనే గెలుపు అంటే ఏమీ చెప్పలేమన్నారు.
ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదని గుర్తు చేశారు. అధికారం అంతా జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని అలాంటప్పుడు వారిని ఎలా బలి చేస్తారన్నట్లుగా ఉండవల్లి మాట్లాడారు. అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదని జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే గొప్ప ప్రయోగం చేశాని సెటైర్ వేశారు. జేడీ పార్టీ పెట్టడం ద్వారా సీట్లు సాధించకపోవచ్చు.. కానీ ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి నిజాయితీగల పార్టీని నడపడం రాక కాదు, నడపడం వల్ల ప్రయోజనం లే అని విశ్లేషించారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవడం కచ్చితంగా వాళ్లకి బలమే అవుతుందని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, తెలంగాణ ఎన్నికల ప్రభావం కచ్చితంగా కనపడుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. ఉండవల్లికి విజయసాయిరెడ్డిపైనా కోపం వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్లో నెహ్రూను విమర్శించారట. జవహర్ లాల్ నెహ్రూ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అమితమైన అభిమానం. అటువంటి నెహ్రూను విజయసాయి పార్లమెంట్లో తప్పుపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి రాజమండ్రిలో పరిస్థితిపైనా ఉండవల్లికి కోపం వచ్చింది. రాజమండ్రిలో విచ్చలవిడిగా భారీ వృక్షాలను నరికేస్తున్నారు.. వెంటనే దాన్ని ఆపాలి. మళ్లీ ఎటువంటి చెట్లు పెంచడం మన వల్ల కాదని అన్నారు. తన దాకా వస్తే కానీ తెలియదన్నట్లుగా.. ఏపీ మొత్తం అంతే ఉందని ఉండవల్లికి ఎవరైనా చెప్పాలేమో ?