కేసీఆర్ పిలిచారు కదా అని ప్రగతి భవన్ విందుకెళ్లిన ఉండవల్లికి తిరిగి రాజమండ్రి చేరుకునే సరికి భారత రాష్ట్ర సమితి ఏపీ ఇంచార్జ్ పదవి రెడీగా ఉందని తెలిసింది. దీంతో కంగారు పడిపోయిన ఉండవల్లి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న పద్దతిలో కేసీఆర్ను విపరీతంగా పొగిడి.. తాను మాత్రం రాజకీయాల నుంచి రిటైరయ్యానని.. ప్రకటించేశారు. అంటే.. బీఆర్ఎస్ జోలికి తాను వెళ్లబోవడం లేదని నేరుగానే చెప్పారు.
ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఆయన కేసీఆర్పై విపరీతంగా పొగడ్తలు కురిపించారు. కేసీఆర్కు ఫుల్ క్లారిటీ ఉందన్నారు. మోదీతో సమానంగా ఆయన కమ్యూనికేట్ చేయగలరని.. రాజకీయం చేయగలరన్నారు. దేశంలో ప్రతిపక్షం ఉండకూడదని బీజేపీ అనుకుంటోందని.. బీజేపీ విధానం వల్ల దేశానికి నష్టమన్నారు.బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరమని.. బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరమన్నారు. కాంగ్రెస్ బలహీనపడినట్లుగా అనిపిస్తోందన్నారు. కేసీఆర్ చెప్పిన విషయాలు విని తాను ఆశ్చర్యపోయానన్నారు . పది రోజుల్లో మరోసారి కలుద్దామని చెప్పారని.. ఎప్పుడు పిలిచినా వస్తానని తాను హామీ ఇచ్చినట్లుగా ఉండవల్లి తెలిపారు. కేసీఆర్కు తనకన్నా ఎక్కువ తెలుసన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. మోదీతో సమానంగా ఆయన కమ్యూనికేట్ చేయగలరన్నారు. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయగల సామర్థ్యం కేసీఆర్కు ఉందని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మంచి కమ్యూనికేటర్ అన్నారు. ఈ విషయంలో మమతా బెనర్జీ కన్నాకేసీఆరే బెటరన్నారు. కేసీఆర్ చెప్పిన విషయాలు విని తాను చాలా ఆశ్చర్యపోయానని ఉండవల్లి తెలిపారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ కేసీఆర్ లీడ్ చేయగలరని ఉండవల్లి స్పష్టం చేశారు ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీనే లేదని స్పష్టం చేశారు. జగన్, పవన్, చంద్రబాబు కూడా బీజేపీకే మద్దతిస్తారన్నారు. ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ సీట్లు బీజేపీవేనన్నారు.
ఇన్ని చెప్పిన ఉండవల్లి అసలు జాతీయ రాజకీయాలపై కేసీఆర్తో చర్చే జరగలేదని చెప్పుకొచ్చారు. అంతేనా.. బీఆర్ఎస్పైనా మాట్లాడలేదన్నారు. ఆయన వ్యూహాలేంటో తనకు తెలియదన్నారు. మొత్తానికి ఉండవల్లి.. కేసీఆర్తో భేటీ అయినందుకు.. తనపై పార్టీ భారాన్ని ఎక్కడ పెడతారోనని కంగారు పడి ప్రెస్ మీట్ పెట్టినట్లుగా ఉందన్న అభిప్రాయం ఎక్కువ మందికి కలుగుతోంది.