ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై విపరీతంగా చర్చ జరుగుతుందనేమో..హత్య చేసినట్లుగా ఒప్పుకున్నా ఆ పార్టీ ఏ చర్యలు తీసుకోలేదేమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారేమో.. వారందర్నీ కాస్త తెరిపిన పడేసేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఎప్పట్లాగే పోలవర గురించి … విభజనసమస్యల గురించి.. పార్టీలు ఏపీ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్లుగా ఉంటుంది కానీ.. ఏపీలో సమస్యలన్నింటికీ అన్ని పార్టీలు కారణమేనని చివరికి సూక్తి ఇస్తున్నారు.
డయాఫ్రం వాల్ పగిపోయిందని ఉండవల్లి 2017లోనే చెప్పారట. వైసీపీ చేస్తున్న వాదనకు సమర్థింపుగా చెప్పుకొచ్చారు. నిజానికి అప్పుడు డయాఫ్రం వాల్ దెబ్బతింటే నిపుణుల కమిటీ 2020 వరకూ గుర్తించదా ? అదేదో చంద్రబాబు మాత్రమే తాపీ పని చేస్తున్నాడు… కాంక్రీట్ పని చేస్తున్నాడు.. కట్టించాడన్నట్లుగా మాట్లాతున్న వైసీపీ నేతలకు ఉండవల్లి సపోర్ట్‌గా తెరపైకి వచ్చారు. రివర్స్ టెండరింగ్ నిర్వాకాల వల్ల హఠాత్తుగా నిర్మాణ పనులు నిలిపివేయడంతో 2020లో సమస్య వచ్చిందని చెప్పినా ఉండవల్లి వైసీపీని రక్షించడానికి తన వాదన తాను వినిపించారు.
వైసీపీ అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదని వస్తున్న విమర్శలను ఆయన అన్ని పార్టీలకూ అన్వయించేశారు. అన్ని పార్టీల ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ మాట్లాడటం లేదన్నారు పోలవరం మొదటి దశ పేరుతో మొత్తం ప్రాజెక్ట్‌ను బ్యారేజీ స్థాయికి తీసుకొచ్చేందుకు ఉండవల్లి మద్దతు తెలిపారు. పోలవరం పూర్తవుతుందన్న నమ్మకం లేదని 41 మీటర్లు ఆనకట్టగా అయినా అభివృద్ధి చేయాలని ఉండవల్లి సూచించారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా మాట్లాడతారు కానీ.. అది వారిని డిఫెండ్ చేసినట్లుగా ఉంటుందని వారికీ తెలుసు. అందుకే ఎవరూ స్పందించరు. ఈ విషయం కూడాఉండవల్లి ఒప్పుకున్నారు. గత ప్రభుత్వంలో తాను చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చేవారు కానీ.. ఇప్పుడు ఎవరూ స్పందించడంలేదన్నారు. కానీ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు బూతులు తిడుతున్నారని చెప్పుకొచ్చారు.