ఎంపీ రఘురామకృష్ణరాజుతో గొడవను ముఖ్యమంత్రి జగనే పరిష్కరించుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమాల్ సలహా ఇచ్చారు. జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా ప్రెస్మీట్లు పెట్టి… పరోక్షంగా హెచ్చరికలతో కూడిన సలహాల్లాంటివి ఇచ్చే ఆయన ప్రస్తుత పరిస్థితులపై మరోసారి మీడియా సమావేశం పెట్టారు. రాజకీయ అంశాలపై జగన్కు సుతిమెత్తగా సలహాలు ఇచ్చారు. సీఎంకు, ఎంపీకి గొడవ వచ్చినప్పుడు.. ముఖ్యమంత్రే స్పందించి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. మంత్రులు కుళాయిల వద్ద కొట్టాడుకున్నట్లుగా బూతులు తిట్టుకోవడం సరికాదని హితవు పలికారు. అయితే ఆయన ఈ హితవు వైసీపీ నేతలకు కాదు.. తెలంగాణ మంత్రులకు చెప్పినట్లుగా ఉంది.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ రెడ్డి చేస్తున్న తప్పులను ప్రధానంగా ఉండవల్లి ఎత్తి చూపి సరిదిద్దుకోవాలని సూచించారు. పోలవరం నిర్వాసితుల విషయంలో తండ్రి వై.ఎస్. లాగే సి.ఎం. జగన్ ఆలోచించాలని సలహా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న సి.ఎం. జగన్ హామీ ఇంకా అమలు కాలేదని.. అసలు నిర్వాసితుల సమస్యను జనగ్ సీరియస్గా తీసుకోలేదని విమర్శించారు. విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం.. కొత్తగా కృష్ణా జలాల సమస్య రావడంపై కూడా ఉండవల్లి స్పందించారు. 151 ఎమ్మెల్యేల బలం ఉండి కూడా సి.ఎం. జగన్ రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించలేదని.. విమర్శించారు. తెలంగాణలో మనవాళ్లు ఏమౌతారని ఆలోచించాల్సి వస్తోందని సి.ఎం. జగన్ అనడం సరికాదన్నారు.
అస్తులు అమ్మి, అప్పులు చేసి నవరత్నాలు అమలు చేస్తున్నట్లుగానే పోలవరంకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. పోలవరం పూర్తి చేసిన క్రెడిట్ కంటే నిర్వాసితుల ఉసురు సి.ఎం జగన్ కు అపకీర్తి తెస్తుందని చెప్పుకొచ్చారు. నీళ్లు నిల్వ చేయకుండా పోలవరం ఎంత ఎత్తులో నిర్మించినా ఉపయోగం లేదని జగన్కు తక్షణ కర్తవ్యం ఉండవల్లి బోధించారు. గత ప్రభుత్వం ఉండవల్లి చీటికి మాటికి ప్రెస్మీట్లు పెట్టి ఘాటు పదాలతో విరుచుకుపడేవారు. ఇప్పుడు.. అంత కంటే విధ్వంసం జరుగుతున్నా సలహాలు చెప్పడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.