మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ .. చాలా రోజుల తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు వారం వారం ప్రెస్మీట్లు పెట్టి.. చిన్న మద్యం బాటిళ్లు లాంటివి పట్టుకుని తయారీకి ఎంత.. ప్రభుత్వానికి ఎంత అనేదాన్ని విశ్లేషించే ఆయన ఇప్పుడు అలాంటి వాటి గురించి మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కష్టం వచ్చింది అనుకున్నప్పుడు ఆయనకు ఫేవర్‌గా మాట్లాడటానికి తెర ముందుకు వచ్చేస్తున్నారు. తాజాగా.. న్యాయవ్యవస్థతో జగన్ జగడం పెట్టుకోవడంతో.. దాన్ని తేలిక చేసేందుకా అన్నట్లుగా ఉండవల్లి మీడియా ముందుకు వచ్చారు. గతంలో ఎన్టీఆర్ కూడా న్యాయవ్యవస్థతో గొడవ పడ్డారని చెప్పుకొచ్చారు. జగన్‌ను ఎన్టీఆర్‌తో పోల్చేశారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ చేసిన దానికి ఇప్పుడు జగన్ చేస్తున్నదానికి పోలికలేమిటో ఉండవల్లి చెప్పలేదు. అయితే జగన్ మాత్రమే కాదని.. గతంలో న్యాయవ్యవస్థపై ఇతరులు కూడా యుద్ధం ప్రకటించారని చెప్పేందుకు ఉండవల్లి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో.. కోర్టుల్లో విచారణ వ్యవహారం గురించి అవసరం లేకపోయినా ఉండవల్లి సలహాలిచ్చేస్తున్నారు. ప్రజాప్రతినిధులపై విచారణను వర్చువల్ పద్దతిలో.. ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన అభిప్రాయాన్ని సీజేఐకి కూడా తెలియచేశానని చెప్పుకొచ్చారు. ఆయన ఉద్దేశం ఏమిటో కానీ.. జగనమోహన్ రెడ్డి కేసులపై రోజువారీ విచారణ ప్రారంభమైన సందర్భంలో ఉండవల్లి డిమాండ్ అనూహ్యంగానే ఉంది. పైగా విదేశాల్లో అలా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. చాలా కాలంగా తనను తాను గొప్ప లాయర్‌గా భావించుకునే ఉండవల్లి.. ఇండియాలో కోర్టు దృశ్యాలు కనీసం బయటకు రావన్న విషయం కూడా తెలియనట్లుగా కొత్త వాదన ప్రారంభించడం విశేషమే.
అయితే.. ఏకపక్షంగా జన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లుగా ప్రెస్మీట్లో మాట్లాడకపోవడం ఆయన నైజం. కానీ ఈ సారి మాత్రం జగన్ ను కాపాడాలనే తాపత్రయం ఎక్కువ కనిపించింది. కేంద్రం మద్దతు కూడా జగన్ కు ఉందన్నట్లుగా మాట్లాడారు. జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేశారని… కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేసి ఉండేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఉండవల్లి … స్వయంగా లాయర్ అయి ఉండి.. న్యాయవ్యవస్థపై దాడి జరుగుతున్నా… తన అభిమాన నేత కుమారుడికి మద్దతుగా మాట్లాడేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు.