ఉండవల్లి అరుణ్ కుమార్.. జగన్మోహన్ రెడ్డి పాలనపై నోరు తెరవడం లేదు కానీ.. ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు విషయంలో మాత్రం.. జగన్ మీడియాలో రచ్చ చేయడానికి ఎంతో కొంత సరంజామాను బయటకు తీసుకొచ్చి పెట్టారు. గతంలో హైకోర్టు కొట్టి వేసిన మార్గదర్శి కేసు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రబభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడంలో సఫలం అయ్యారు. ఈ మేరకు జగన్కు తన వైపు నుంచి గుడ్ న్యూస్ అందించారు. అసలు హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే.. ఉండవల్లి ఇంత హఠాత్తుగా ఎందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టారనేది.. చాలా మందికి.. అర్థం కాని విషయం . అయితే.. ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితుల్ని… అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను .. ఈనాడు పత్రిక.. వాటిని ఎదురొడ్డుతున్న విషయాన్ని అర్థం చేసుకుంటే మాత్రం ఇందులో రాజకీయం ఉందన్న విషయం కొంత అవగాహనకు రావొచ్చు.
వైఎస్ హయాంలో.. మార్గదర్శి సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందంటూ… ఉండవల్లి కోర్టుకు వెళ్లారు. మార్గదర్శి సంస్థ హిందూ అవిభక్త కుటుంబం పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ సంస్థ తమ కుటుంబంలోని వ్యక్తుల నుంచి మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. బయట వ్యక్తులనుంచి సేకరించకూడదు. కానీ మార్గదర్శి బయట వ్యక్తుల నుంచి డిపాజిట్లు సేరించిందనేది ఉండవల్లి ఆరోపణ. ఈ ఆరోపణలు కలకలం రేపడంతో.. వివాదాలకు దూరంగా ఉండాలనుకున్న రామోజీరావు.. తన టీవీ చానళ్లను అన్నింటినీ అమ్మేసి.. డిపాజిట్లన్నింటినీ తిరిగి ఇచ్చేశారు. తర్వాత హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. ఇప్పుడు.. మళ్లీ హైకోర్టు తీర్పుపై ఉండవల్లి సుప్రీంకోర్టుకు వెళ్లారు.
దీనిపై జగన్ మీడియా మళ్లీ పుంఖానుపుంఖాలుగా పాత కథనాలు తీసి ప్రచారం చేయడం ప్రారంభించింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. రెండు వారాలకోసారి టైం పెట్టుకుని మరీ ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు చేసిన ఉండవల్లి.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పాలనపై మాత్రం స్పందించడం లేదు. పైగా.. జగన్ వ్యూహాలకు అనుగుణంగా.. తన లాయర్ కోటును ఉపయోగిస్తున్నారన్న అభిప్రాయం బలపడేలా అడుగులు వేస్తున్నారు.