మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కేంద్రం వద్ద బయటకు రాకుండా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా..? ఆయన జగన్ కు తాజాగా రాసిన లేఖ చూస్తే అలాగే అనుకోవాలి. రాష్ట్ర విభజనపై ప్రధాని, హోంమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి.. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని ఎంపీలతో ఆందోళన చేయించాలని.. ఉండవల్లి లేఖలో కోరారు. పార్లమెంట్ తలుపులు మూసి మరీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారని… ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని.. విభజన అక్రమంగా జరిగిందన్న అర్థంలో.. గతంలో మోడీ, అమిత్ షా ప్రకటనలు చేశారు. పార్లమెంట్‌లోనూ ఓ సారి మోడీ ఆ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఎన్నికల ప్రచారంలోనూ.. విభజన అంశాన్ని చాలా సార్లు మోడీ ప్రస్తావించి.. పద్దతి లేకుండా.. విభజించి.. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని విమర్శలు గుప్పించారు. వీటిపైనే పార్లమెంట్లో ప్రస్తావించాలని.. ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ను కోరుతున్నారు. నిజానికి విభజన జరిగిన తీరు చెల్లదంటూ.. ఉండవల్లి కోర్టుల్లో పిటిషన్లు వేసి వాయిదాలకు హాజరవుతున్నారు. ఇప్పుడీ విషయంలోకి జగన్ ను లాగాలని ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ.. ఎంపీలు కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల విషయంలోనే.. కేంద్రాన్ని ఒక్క మాట అడగలేకపోతున్నారు.
అలాంటిది నేరుగా.. మోడీ, షాలు.. విభజన చేసిన వ్యాఖ్యల గురించి చర్చ పెట్టాలని అడగలరా..?… అడిగితే ఆ తర్వాత పరిణామాలను ఎవరైనా ఊహించగలరు. అన్నీ తెలిసి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ .. జగన్ కు లేఖ రాశారు. అంటే.. జగన్ ను టీజ్ చేద్దామన్న ఉద్దేశం అయినా ఉండొచ్చు లేకపోతే.. జగన్ ధైర్యంపై ఆయనకు గట్టి నమ్మకం అయినా ఉండొచ్చని అంటున్నారు. ఒక వేళ జగన్ ధైర్యం పై ఉండవల్లికి నమ్మకం ఉందనుకుంటే… ఆ నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకుంటారో లేదో మరి..!?