గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని అనంతవరం అనే గ్రామంలో.. వినాయకవిగ్రహం వద్ద ఎమ్మెల్యే శ్రీదేవిని కొంత మంది అడ్డుకున్న వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. సీఎం జగన్‌తో.. హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు శ్రీదేవి సమావేశమయ్యారు. తనకు అనంతవరం గ్రామంలో అవమానం జరిగిందని.. కులం పేరుతో దూషించారని ఎమ్మెల్యే శ్రీదేవి జగన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని .. ఏ పార్టీకి చెందినవారైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకావొద్దని జగన్ హోంమంత్రి సుచరితకు సూచించారు. శ్రీదేవి కేసులో అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని… ఆదేశించారు. అయితే ఈ ఘటనలో నిందితులు టీడీపీ నేతలేనంటూ… వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనికి టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
ఎమ్మెల్యే కేసు పెట్టి అరెస్ట్ చేయిచిన కొమ్మినేని శివయ్య… ఎమ్మెల్యేను వినాయక మండపం వద్దకు ఆహ్వానించిన వైసీపీ నేత కొమ్మినేని అశోక్ తండ్రని గుర్తు చేస్తున్నారు. అక్కడ పార్టీలేవీ లేకపోయినా టీడీపీకి అంటగడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో… టీడీపీ నేతలు మరో కోణంలో… ఆరోపణలు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి .. తాను క్రిస్టియన్‌ను అని..తన భర్త కాపు అని అంగీకరించిన వీడియోలను..సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మతం మారినందున.. ఆమెకు రిజర్వేషన్ వర్తించదని… అయినప్పటికీ..దళిత మహిళగా చెప్పుకుని.. ఎస్సీలకు చెందిన సీటు నుంచి పోటీ చేసి.. దళితులను మోసం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఈ ఆరోపణలపై టీడీపీ నేత చంద్రబాబు కూడా.. తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందించారు.
ఎస్సీల సీటును క్రిస్టియన్ కు కట్టబెట్టి దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి… రాజకీయం చేయడం వైసీపీకి పుట్టుకతో వచ్చిన సిద్ధాంతమని మండిపడ్డారు. అనంతవరం గ్రామంలో వినాయకుని మండపానికి ఎమ్మెల్యే శ్రీదేవి వెళ్లారు. పూజలు చేశారు. ప్రసాదం కూడా తీసుకున్నారు. తిరిగి వెళ్లే సమయంలో గొడవ జరిగింది. అయినప్పటికీ.. తనను ముట్టుకోనివ్వలేదని.. పూజ చేయనివ్వలేదని.. విగ్రహం మైల పడుతుందని తిట్టారని ఎమ్మెల్యే ఆరోపణలు చేయడంతో… ఈ విషయానికి కుల రంగు పులుముకుంది.