హైదరాబాద్: రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిరాహారదీక్ష విషయంలో జగన్‌ను వెనకేసుకొచ్చారు. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ దీక్ష చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, ప్రత్యేక హోదా కోసమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడుతుంటే విమర్శించటం సరికాదని చెప్పారు. ఈ దీక్షను చంద్రబాబు కేంద్రం దగ్గర వాడుకుని ఉండాల్సిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్ష చేస్తూ గొడవ చేస్తున్నాడని, ప్రజలనుంచి మైలేజి పొందుతున్నాడని ప్రధానికి చెప్పి ఖండన చేయించాలని, ఈ అవకాశాన్ని వాడుకోవాలని అన్నారు. దీక్ష చేస్తున్నవారిపై బురద జల్లటం తన జీవితంలో మొదటిసారి చూస్తున్నారని చెప్పారు. జగన్ దీక్ష డ్రామా అని మంత్రులు ఆరోపించారని, మళ్ళీ ఆరోగ్యం ప్రమాదస్థాయికి చేరిందంటూ దీక్షను భగ్నం చేశారని, ఇది చాలా విడ్డూరంగా ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు పరస్పరం పొగుడుకోవటానికి సరిపోతోందని అన్నారు. చంద్రబాబు ఈవెంట్ మేనేజర్‌గా మారారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజ్ కూడా కావాలని అన్నారు. ఉండవల్లి వ్యాఖ్యలు చూస్తుంటే వైసీపీలోకి జంప్ అయ్యేటట్లే కనిపిస్తోంది. జగన్ దీక్షలో చిత్తశుద్ధి కనిపించటంలేదని, దీక్షను భగ్నం చేయాలని ఆయనే కోరుకున్నారని అందరూ అనుకుంటుంటే ఉండవల్లి దానికి భిన్నంగా వాదిస్తున్నారు.