రాజకీయ నేతలు ఐఏఎస్, ఐపీఎస్లు కాలేరు … కానీ ఐపీఎస్, ఐఏఎస్లు తల్చుకుంటే రాజకీయ నేతలు అవుతారని సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. కానీ రాజకీయ నేత అనే ట్యాగ్ తగిలంచుకోగలరు కానీ.. రాజకీయాలు మాత్రం చేయలేరనేది వాస్తవంగా బయట జరుగుతూ ఉంటుంది. దీనికి పాత ఉదాహరణ జయప్రకాష్ నారాయణ అయితే.. కొత్త ఉదాహరణ మాజీ సీబీఐ జేడీ వీవీ లక్ష్మినారాయణ.
మాజీ సీబీఐ జేడీ వీవీ లక్ష్మినారాయణ మహారాష్ట్ర క్యాడర్ లో ఐపీఎస్ గా పని చేసి.. రెండేళ్లు ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు అప్పట్లో వచ్చిన హైప్ చూస్తే.. బడా నాయకుడు అయిపోతాడని అనుకున్నారు. ఎందుకంటే… ఆయనకు ఉన్న ఇమేజ్ అటువంటిది. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ అవినీతి మొత్తం దర్యాప్తు అధికారిగా కోర్టుల ముందు పెట్టారు. ఆ ఇమేజ్ తోనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన వేసిన అడుగులతో మొత్తం నేల మట్టం అయింది.
ప్రభుత్వ ప్రకటనలకే ప్రశంసలు కురిపించడం దగ్గర్నుంచి ఇటీవల ఆయన జగన్ రెడ్డి ఆరోగ్య సురక్ష , నాడు, నేడు బాగుందంటూ ప్రశసించడంతో ఏదైనా కొద్దో గొప్పో మిగిలి ఉంటే అది కూడా కొట్టుకుపోయింది. ఆరోగ్య సురక్ష అనేది ప్రజాధనంతో చేస్తున్న పార్టీ ప్రచారం. ఆస్పత్రుల్లో చేయాల్సినవి చేయకుండా ఆపేసి… ప్రచారం కోసం క్యాంపులు పెట్టి చేస్తున్నారు. నాడు – నేడు అంటే స్కూళ్లకు రంగులేసి వేలకోట్లు కొట్టేశారు… మరి టీచర్ల నియామకం ఏది ? విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మౌలికంగా ఏం ఉండాలో జేడీకి తెలియదా ?
తాను చేసిన వ్యాఖ్యలు ఎంత మిస్ ఫైర్ అయ్యాయో అర్థమైయిందేమో కానీ… సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. శ్రీశైలం ఎమ్మెల్యే పిలిచాడని వెళ్లి కాస్త పొగిడానని… ఆ పార్టీలో చేరడం లేదని వివరణ ఇచ్చారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.