వినాయక్ రాజకీయాల్లోకి వస్తాడా? వస్తే ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? ఈ విషయాలపై చిత్రసీమ ఆసక్తిగా చర్చించుకుంటోందిప్పుడు. దానికి తగ్గట్టు వినాయక్ రాజకీయాలపై స్పందించారు కూడా. `మీరు రాజకీయాల్లో చేరే అవకాశం ఉందా` అని అడిగితే.. ఆయన స్పష్టంగా సమాధానం చెప్పాలేదు గానీ… ఆ అవకాశాల్ని కొట్టి పారేయలేదు. `నేను దర్శకుడ్ని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు, అయ్యాను. ఇప్పుడు రాజకీయాలపై దృష్టి లేదు. కానీ దేవుడు ఎలా నడిపిస్తాడో చూడాలి.. అదో విధిరాత` అన్నాడు వినాయక్. ”మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అందుకే నేను రాజకీయాల్లోకి వస్తానేమో అని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు గానీ.. భవిష్యత్తు చెప్పలేను” అని చెప్పుకొచ్చాడు వినాయక్. తదుపరి సినిమా గురించి కూడా ఇంకా ఏమీ అనుకోలేదట. ”ఓ సినిమా అయిపోయిన తరవాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. అంతే గానీ ముందు నుంచీ నాకు ఎలాంటి ప్రణాళికలూ ఉండవు. ‘ఇంటిలిజెంట్’ విడుదలయ్యాకే కొత్త సినిమా గురించి చెబుతా” అన్నాడు వినాయక్. ఆయన దర్శకత్వం వహించిన ఇంటిలిజెంట్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.