చిరంజీవి 150వ సినిమాని రాజకీయంగా తొక్కేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నట్టు… అందుకే విజయవాడలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అనుమతి లభించనట్టు… అప్పట్లో చాలా వార్తలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని వినాయక్ కూడా ప్రస్తావించడం టాలీవుడ్‌కి షాక్ ఇచ్చింది. ఖైదీ నెం.150 కలక్షన్ల వివరాలు తెలుపడానికి వినాయక్, అల్లు అరవింద్ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వినాయక్ మాట్లాడుతూ అభిమానుల తాలుకూ భయాల్ని బయటపెట్టాడు. కొంతమంది అభిమానులు వినాయక్‌కి ఫోన్ చేసి నైజాం, కృష్ణ, సీడెడ్లలో తమ సినిమాకి అన్యాయం జరిగిందని వాపోయారట. ”ఎవ్వరూ ఏం భయపడకండి.. మన సినిమాకి రావాల్సిన వసూళ్లు తప్పకుండా వస్తాయి.. అన్నింటికంటే సినిమానే ముఖ్యం. ఈ విషయంలో అపోహలు పడి నోరు జారొద్దు” అంటూ… అభిమానులకు సూచించాడట. చిరు సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది అంటూ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలోనే వినాయక్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
చిరు సినిమా ఎంత వసూలు చేసింది? వంద కోట్ల క్లబ్లో చేరిందా? లేదా? అనే విషయంపై అల్లు అరవింద్ ఇదే సమావేశంలో ఓ క్లారిటీ ఇచ్చారు. తొలి వారంలోనే దాదాపు రూ.108 కోట్ల గ్రాస్ సంపాదించిందని, ఇంత త్వరగా వంద కోట్ల క్లబ్లో చేరిన తొలి తెలుగు సినిమా ఇదే అంటూ అరవింద్ అధికారికంగా డిక్లేర్ చేసేశారు. ఇందుకు సంబంధించి కృతజ్ఞతాభినందన సభ అంటూ ఓ ఈవెంట్‌ని అతి త్వరలో నిర్వహిస్తారట. ఇంత పెద్ద విజయం అందించినందుకు అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసి. చిత్రబృందాన్ని అభినందించడానికి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోనే ఉండబోతోంది. ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారు అనే విషయాలు త్వరలో చెబుతామంటున్నారు అరవింద్.