అవును.. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ నిర్మాతగా మారుతున్నారు. అదీ తనికెళ్ల భరణి కోసం. అయితే… ఇదేం సినిమా కాదు. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం. తనికెళ్ల భరణిలోనూ ఓ దర్శకుడు ఉన్న సంగతి తెలిసిందే. సిరా అనే షార్ట్ ఫిల్మ్ తీశారు భరణి. మిథునం సినిమాతో అందరినీ ఆకట్టుకొన్నారు. ఇప్పుడు ‘లాస్ట్ ఫార్మర్’ మరో షార్ట్ ఫిల్మ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఒక నిమిషం వ్యవథిగల ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని సమాచారం. ఇటీవల ఈ కథ విన్న వినాయక్ ‘మీకు అభ్యంతరం లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ నేను నిర్మిస్తా’ అని భరణితో చెప్పినట్టు టాక్. అలా.. భరణి కోసం వినాయక్ నిర్మాతగా మారుతున్నారన్నమాట. నిజానికి విష్ణుతో ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని నిర్మించడానికి తనికెళ్ల భరణి సన్నాహాలు చేసుకొన్నారు. రూ.50 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కాల్సివుంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఈలోగా షార్ట్ ఫిల్మ్ తీయాలని భరణి భావిస్తుండడం. ఆ కథ నచ్చి వినాయక్ ప్రొడ్యూసర్గా మారడం.. విశేషం. సిరా అనేక అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకొంది. మరి.. లాస్ట్ ఫార్మర్తో తనికెళ్ల భరణి ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.