వివి వినాయక్ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. ఆది, ఠాగూర్, బన్నీ, కృష్ణ, అదుర్స్, నాయక్ లాంటి మాస్ హిట్స్ ఆయన ఖాతాలో వున్నాయి. ‘అఖిల్’తో నిరాశ పరిచినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ‘ఖైదీ నెంబర్150’ కోసం మళ్ళీ వినాయక్ నే ఎంచుకున్నారంటే ఆయనపై వున్న గురి అర్ధం చేసుకోవచ్చు. అయితే వినాయక్ మాత్రం సినిమాలు చేయడంలో మనుపటి జోరు కనబరచడం లేదు.
సాయి ధరమ్ తేజ్ తో చేసిన ‘ఇంటిలిజెంట్’ తర్వాత ఆయన నుంచి మళ్ళీ సినిమా రాలేదు. మధ్యలో ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు కానీ అది ఎప్పుడు మొదలై ఎప్పుడు వచ్చి వెళ్లిందో చాలా మందికి తెలీదు. పైగా ఆ సినిమా తెలుగు వెర్షన్ ని కూడా విడుదల చేయలేదు. వినాయక్ అంటే ఇండస్ట్రీలో వున్న హీరోలందరికీ ఇష్టం. ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తిగా వుంటారు. కానీ సరైన కథ కుదరకపోవడంతో ఈ గ్యాప్ వచ్చింది.
అయితే ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పడుతున్నారు వినాయక్. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుంది. రవితేజకి కృష్ణ లాంటి సూపర్ హిట్ ఇచ్చారు వినాయక్. వారి మధ్య మంచి అనుబంధం వుంది. రవితేజని ద్రుష్టిలో పెట్టుకొని ఓ కథని సిద్ధం చేశారు వినాయక్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. రవితేజ కూడా జోరుమీద వున్నారు. సినిమాలని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. వినాయక్ కథ పై చాలా పాజిటివ్ గా వున్నారని తెలిసింది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై ప్రకటన రానుంది.