దర్శకులు నిర్మాతలుగా మారడం మామూలే. అయితే కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ.. `సేఫ్ జోన్`లో ఆలోచించే కొంతమంది దర్శకులు ఎప్పుడూ ప్రొడక్షన్వైపు కన్నెత్తి చూడలేదు. అయితే వినాయక్ మాత్రం ప్రొడక్షన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకెప్పటి నుంచో తక్కువ బడ్జెట్లో, ఓ వినూత్నమైన ప్రేమకథ తీయాలని ఉంది. దాన్ని బయటి నిర్మాతలతో తీయడం కంటే, సొంత బ్యానర్లో చేయడం బెటర్ అన్నది ఆయన ఫీలింగ్. ఇదేం.. నేరుగా చెప్పకపోయినా.. ప్రొడక్షన్ విషయంలో చిన్న హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
”అప్పుడప్పుడూ కొత్తగా ఆలోచించి సినిమాలు చేయాలని ఉంటుంది. నేనూ నాలుగేళ్లుగా అదే ఆలోచనలో ఉన్నాను. కానీ మన టేస్టు మరో నిర్మాతపై బలవంతంగా రుద్దకూడదు కదా.. అందుకే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. రాబోయే రెండేళ్లలో అలాంటి సినిమా నా నుంచి తప్పకుండా ఆశించొచ్చు” అన్నారు వినాయక్. సో.. వినాయక్ నుంచి ఓ కొత్త ప్రయత్నాన్ని చూడొచ్చన్నమాట. దాంతో పాటు నిర్మాతగానూ తెరపై వినాయక్ పేరు కనిపించే అవకాశాలున్నాయి.