తమిళంలో కొంతమంది దర్శకులు నటులుగానూ సక్సెస్ అయ్యారు. సముద్రఖనిలాంటివాళ్లు అందుకు పెద్ద ఉదాహరణ. సముద్రఖని దర్శకత్వం కూడా మానేసి.. నటనపై దృష్టి కేంద్రీకరించేంత పెద్ద నటుడైపోయాయి. తెలుగులో అలాంటి వాళ్లు చాలా తక్కువ. పూరి, శ్రీకాంత్ అడ్డాల, శేఖర్ కమ్ములలాంటి వాళ్లు అప్పుడప్పుడూ… తమ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా మెరుస్తుంటారు. అలాంటిది ఇప్పుడు వినాయక్ హీరో అయిపోతున్నాడు. దిల్‌రాజు బ్యానర్లో వినాయక్ హీరోగా ఓ సినిమా రూపొందుతుతోంది.
అయితే ఇది కమర్షియల్ ఫార్మెట్లో ఉండే కథ కాదు. పాటలు, ఫైటింగులు ఏమీ కనిపించవు. ఓ మైండ్ గేమ్‌తో సాగే రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. కథానాయకుడి పాత్రకు ఎలాంటి ఇమేజీ ఉండకూడదు. అంతేకాదు.. వయసు పైబడినవాడిలానూ కనిపించాలి. అందుకే వినాయక్‌ని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం వినాయక్ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారట. అందుకు సంబంధించిన కసరత్తులు సాగుతున్నాయి. వినాయక్ బరువు తగ్గాకే ఈ ప్రాజెక్టు మొదలవ్వబోతోందని తెలుస్తోంది. `ఠాగూర్`లో ఓ చిన్న పాత్రలో వినాయక్ కనిపించడం గుర్తుండే ఉంటుంది. నటుడిగా వినాయక్ అవతార్తం ఎత్తడం యాదృచ్చికంగా జరిగింది. ఆ పాత్ర వేయాల్సిన నటుడు సరైన సమయానికి రాకపోవడంతో.. చిరంజీవి సలహాతో ఆపధర్మ నటుడిగా అవతారం ఎత్తాడు వినాయక్. మరి `హీరో`గా ఏ మేర మెప్పిస్తాడో చూడాలి