ఒకప్పుడు జెట్ స్పీడ్ తో సినిమాలు తీసి, టాప్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకొన్నారు వి.వి.వినాయక్. దాదాపు అగ్ర హీరోలందరితోనూ పని చేశారు. సూపర్ హిట్లు ఇచ్చారు. కొంతకాలంగా మెగాఫోన్ పట్టలేదు. కొన్ని స్క్రిప్టులు సిద్ధం చేసుకొన్నా, ఎందుకో అవి వర్కవుట్ కాలేదు. వినాయక్ రిలాక్సింగ్ మోడ్లో ఉన్నారని, ఆయనకు సినిమాలపై ధ్యాస లేదన్న కామెంట్లు వినిపించాయి. కానీ వినాయక్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన త్వరలో నిర్మాతగా మారబోతున్నారని టాక్. సినిమాలతో పాటుగా కొన్ని వెబ్ సిరీస్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు వినాయక్.
కొంతమంది యువ దర్శకులు, రచయితలతో స్క్రిప్టులు సిద్ధం చేయిస్తున్నారు. మళ్లీ మెగాఫోన్ పట్టే ఆలోచన కూడా ఉంది. చేస్తే ఓ పెద్ద హీరోతోనే సినిమా చేయాలని, ఓ మంచి హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకొంటున్నారాయన. అందుకే మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చినా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. టాలీవుడ్ కు హీరోల కొరతే కాదు, దర్శకుల కొరతా ఉంది. మేకింగ్ పట్ల అభిరుచి ఉండి, మాస్ పల్స్ తెలిసిన వినాయక్ లాంటి దర్శకులు పరిశ్రమకు కావాలి కూడా.