నవతరం దర్శకులు, స్టార్ దర్శకులు కొత్త కథలతో, కాంబినేషన్లతో రెచ్చిపోతుంటే, వినాయక్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. `ఇంటిలిజెంట్` లాంటి సినిమాతో వినాయక్ క్రేజ్ పది మెట్లు కిందకి దిగజారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే.. తన శైలికి సరిపడ కథ వస్తే మాత్రం వినాయక్ బాక్సాఫీసుని షేక్ చేసేయగలడు. చేతిలో నందమూరి బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ హీరో ఉన్నాడు. సి.కల్యాణ్ లాంటి నిర్మాత ఉన్నాడు. కానీ.. సరైన కథ మాత్రం సెట్ చేయలేకపోతున్నాడు. గత మూడు నెలల నుంచి కథల తయారీలో తలమునకలై ఉన్నాడు వినాయక్. అయితే… కథేదీ సెట్ కావడం లేదు. వినాయక్ కథకుడు కాదు. తన కథల్ని తానే సొంతంగా తయారు చేసుకోలేడు. తన సమస్య అదే. వినాయక్ ఫామ్లో ఉన్నప్పుడు తాను ఏ కథ పట్టుకున్నా.. హిట్ అయ్యి కూర్చునేది. ఇప్పుడు ఆ కథలతోనే అసలు సమస్య వస్తోంది. ఆకుల శివ లాంటి ఆస్థాన రచయితలకు ఇప్పటి వరకూ కథలు అందించారు. ఈమధ్య ఆ కథలన్నీ బెడసి కొట్టడం మొదలెట్టాయి. కొత్త వాళ్లని పిలిచి కథలు వింటున్నా.. అవేం వర్కవుట్ అవ్వడం లేదు. మరోవైపు సి.కల్యాణ్ కూడా వినాయక్ పై కాస్త అసంతృప్తితో ఉన్నాడట. కథ రెడీ కాకపోవడంతో.. మరో దర్శకుడ్ని వెదుక్కోవాలని డిసైడ్ అయ్యాడట. బాలయ్య – బోయపాటి సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈలోగా వినాయక్ కథ సెట్ చేస్తే ఓకే, లేదంటే… బోయపాటి సినిమాకే సి.కల్యాణ్ నిర్మాతగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లేదంటే మరో దర్శకుడితో బాలయ్య సినిమా సెట్ చేయాలని కూడా చూస్తున్నాడట.