ఓ ఫ్లాపు సినిమా తీయడం ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుకాదు. ఎందుకంటే కావాలని ఫ్లాప్ సినిమా ఎవ్వరూ తీయరు. అది అలా జరిగిపోతుందంతే. కాకపోతే కొన్ని తప్పులు తెలిసి తెలిసి చేయడం.. ఘోరం. నేరం. ‘వినయ విధేయ రామ’ విషయంలో అలాంటి తప్పులే జరిగాయి. అందుకే ఈ ఫ్లాప్‌కి అటు రామ్ చరణ్, ఇటు చిత్రబృందం అంతగా కుమిలిపోతోంది. ఎప్పుడూ లేనిది.. ‘మీ అంచనాల్ని అందుకోలేకపోయాం’ అంటూ రామ్‌చరణ్ తన అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాడంటే… ఈ పరాజయం చరణ్‌ని ఎంతగా కృంగదీసిందో అర్థం చేసుకోవొచ్చు.
సినిమా ఫ్లాప్ అయిన దగ్గర్నుంచి చరణ్ – బోయపాటికి మధ్య బోయపాటి- దానయ్య మధ్య మాటల్లేవు. తాజాగా చరణ్ ఉత్తరం రాయడం బోయపాటిని తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు ఈ టీమ్ మధ్య ఉన్న గ్యాప్ కూడా బహిర్గతం అవుతూనే ఉంది. బోయపాటి -దానయ్య మధ్య లుకలుకలు తీవ్రమయ్యాయని టాలీవుడ్ టాక్. దర్శకుడికీ, నిర్మాతకీ గ్యాప్ వచ్చిందని తెలుసుకున్న చరణ్.. ఇప్పుడు పూర్తిగా నిర్మాత వెనకే నిలబడ్డాడని తెలుస్తోంది.
దానికి కారణం ఉంది. ‘వినయ విధేయ రామ’లో బోయపాటి తెలిసి తెలిసి కొన్ని తప్పులు చేశాడట. ‘ఇది వర్కవుట్ అవ్వదు’ అని ఇటు చరణ్, అటు దానయ్య చెబుతున్నా – బోయపాటి ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు చూసి థియేటర్లో జనం నవ్వుకున్నారు. ఆ సన్నివేశాల్ని షూట్ చేస్తున్నప్పుడు కూడా చరణ్, దానయ్య అభ్యంతరం వ్యక్తం చేశార్ట. కానీ.. బోయపాటి ఎవ్వరి మాటా వినలేదని సమాచారం. అజెర్బైజాన్ ఎపిసోడ్‌కి చిత్రబృందం కోట్లు ధారబోసింది. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని చరణ్ ముందే అడిగాడట. కానీ… బోయపాటి మాత్రం లెక్క చేయలేదని సమాచారం. నటీనటుల ఎంపికలో కూడా బోయపాటి సర్వాధికారాలూ తీసుకున్నాడని, ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోయి బడ్జెట్‌ని పెంచుకుంటూ వెళ్లాడని, ఫైనల్ రష్ చూశాక చెప్పిన సలహాలూ, సూచనలు కూడా బోయపాటి పాటించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చిత్రబృందం అంతా ఓ వైపు, బోయపాటి మరోవైపు ఉండిపోయాడు.