హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి, చేవేళ్లలో ఏదో ఓ ఓ స్థానం నుంచి పార్లమెంట్ బరిలో నిలబడేందుకు లక్ష్మణ్ అంగీకరించారని చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చారని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన లక్ష్మణ్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టకు మెంటార్‌గా ఉన్నారు.
లక్ష్మణ్ ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రకటనలు చేయలేదు. ఆయనకు దైవభక్తి మెండు. సాయిబాబాపై ఆయన కొన్ని పాటలు రాశారు. కానీ రాజకీయాల గురించి మాత్రం ఆయన వైపు నుంచి ఇప్పటి వరకూ ఒక్క ప్రకటన కూడా రాలేదు. మరి బీజేపీ నేతలు ఆయనతో రాజకీయ ఆసక్తిని ఎలా గమనించారో కానీ.. కలవడం.. ఆయన బీజేపీలో చేరడానికి అంగీకరించడం అయిపోయాయనని చెబుతున్నారు.
అయితే వీవీఎస్ లక్ష్మణ్ వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఆయన చెప్పిన తర్వాతనే ఇది నిజమని క్లారిటీకి రావొచ్చు. అయితే బీజేపీకి సినిమా, క్రికెట్ సెలబ్రిటీల్ని ఆకట్టుకుని ఎన్నికల బరిలోకి దించడంలో ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ ప్రకారం చూస్తే బీజేపీ లక్ష్మణ్‌ను ప్రేమించిఉంటే.. తప్పక లక్ష్మణ్ కూడా ప్రేమించాల్సిందే. తిరస్కరించే ధైర్యం ఉండకపోవచ్చని గత అనుభవాలు చెబుతున్నాయంటున్నారు.