వైజయంతి మూవీస్ అంటే భారీ సినిమాలకు పెట్టింది పేరు. చిన్న సినిమాని కూడా భారీ సెటప్ తో తీయడం అశ్వినీదత్ కి అలవాటు. ఇప్పుడు ఆయన పిల్లలు స్వప్న, ప్రియాంకలకు కూడా అదే అలవాటైయింది. వాళ్ళ సినిమాల్లో చాలా సార్లు మార్కెట్ లెక్కలకు భిన్నంగా వుంటాయి. అసలు తెలుగులో బయోపిక్ ఆడుతుందా లేదా అనే సందేహాలు వున్న సమయంలో మహానటి తీశారు. పరాయి భాష హీరోకి తెలుగు మార్కెట్ ఎక్కడిది ? అనే ప్రశ్నలు వస్తున్న తరుణంలో సీతారామం చూపించారు. విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలకి ప్రేక్షకులు ఊహించినదాని కంటే ఎక్కువ ఆదరణ చూపించారు.
ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ కూడా ఇలా మార్కెట్ లెక్కలు వేసుకోకుండా తీసిన సినిమాగానే కనిపిస్తోంది. సంతోష్ శోభన్ చాలా సినిమాలు చేశాడు కానీ ఇప్పటికీ ఒక సరైన హిట్ లేదు. మాళవిక నాయర్ కి కూడా హీరోయిన్ గా బ్రేక్ లేదు. నందిని రెడ్డికి విజయాలు వున్నాయి కానీ ఆమె సినిమాన్నీ ఒక సెటప్ ఆడియన్స్ కే పరిమితం అన్నట్లుగా వుంటాయి.
అయితే ఇలాంటి కాంబినేషన్ లో అన్నీ మంచి శకునములే చిత్రాన్ని కాస్త గ్రాండ్ గానే తీశారని ట్రైలర్ చూస్తే అర్డమౌతుంది. ఫారిన్ లోకేషన్స్ తో పాటు హిల్ స్టేషన్.. గౌతమి, షావుకార్ జానకీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ .. ఇలా వెటరన్ నటీనటులందరినీ ఒక్క చోటకి చేర్చి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఖర్చు బాగానే అయినట్లు వుంది కానీ క్రౌడ్ ఫుల్లర్లు లేరు. అయితే కంటెంట్ బావుంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందనేది నిర్మాతల నమ్మకం. ఆ ధైర్యంతో ఇంత తారాగణం, ఖర్చుతో అన్నీ మంచి శకునములే చేశారు. మరి నిర్మాతల నమ్మకం ఏమౌతుందో చూడాలి.