ఎన్టీఆర్ బొమ్మనే బ్యానర్ లోగోలో పెట్టుకుని ఆరంభించారు వైజయంతీ మూవీస్ ను నిర్మాత అశ్వనీదత్ ను. గుండెధైర్యం గల నిర్మాత అంటే గుర్తు వచ్చే పేరు. ఎన్ని సినిమాలు తీసారో. అందులో బ్లాక్ బస్టర్లు వున్నాయి, డిజాస్టర్లు వున్నాయి. అయినా వెనుకడుగు వేయలేదు. తను బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోలు ఎవరూ, డిజాస్టర్లు వచ్చిన టైమ్ లో ఆదుకున్నట్లూ కనిపించదు. అయినా చింత లేదు.
ఆయనకు తగ్గ పిల్లలే..స్వప్న, ప్రియాంక. పక్కా మొండి ఘటాలు. తండ్రి బాటలో కాకుండా చిన్న సినిమాలు, వైవిధ్యమైన సినిమాలు ప్రయత్నించడం ఆరంభించారు. అదృష్టం కలిసిరాలేదు. జనం వెనకన వెక్కిరించారు. ఐరన్ లెగ్స్ అన్నారు. తండ్రి బ్యానర్ పరువు తీస్తున్నారన్నారు. అయినా పట్టించుకోలేదు.
తమ సమకాలీన యువ సంచయంతో కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం తీసి చూపించారు. ఆ తరువాత మూడేళ్ల పాటు పాతిక కోట్ల ఖర్చును తలపై పెట్టుకుని, మహానటి బయోపిక్ తీసారు. తీయడం కాదు. అహరహం శ్రమించారు. నిర్మాతలుగా కాదు. నాగ్ అశ్విన్ లకు కుడి ఎడమలుగా, తాము ఓ టెక్నీషియన్లుగా, పగలు రాత్రి తేడా లేకుండా సినిమా కోసం శ్రమించారు. దత్తు ఇంటి అల్లుడిగా మారిన నాగ్ అశ్విన్, ఆ ఇంటి ఆడపిల్లల ఆలోచనలకు మరింత బలమైన తోడయ్యారు. ముగ్గురు కలిసి త్రిమూర్తి స్వరూపంలో మహానటి విశ్వరూపం చూపించారు.
దాదాపు 27 కోట్ల వ్యయం ఎదురుగా కనిపిస్తున్నా, భయపడలేదు. సినిమాను తెగనమ్మలేదు. ఆఖరికి శాటిలైట్, డిజిటల్ కూడా చేయలేదు. ధైర్యంగా నేరుగా విడుదలచేసారు. అందిన కాటికి కాస్త అడ్వాన్స్ లు తీసుకున్నారు. అంతే. దాదాపు 15 కోట్లకు పైగా డెఫిసిట్. మూడు పదులకు కాస్త అటు ఇటు వున్న అమ్మాయిలకు ఇంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చినట్లు? తండ్రి పోలిక అనుకోవాలా?
సినిమా ప్రపంచంలో తమ సంబంధాలు వాడుకుని, సినిమాకు మాంచి బజ్ తీసుకువచ్చారు. పబ్లిసిటీని ఖర్చుతో కన్నా, వైవిధ్యంగా ప్లాన్ చేసారు. అన్నీ చేసి విడుదలచేసారు. ఇప్పుడు జేజేలు అందుకుంటున్నారు. ఇది అశ్వనీదత్ ఆడబిడ్డలు అందుకున్న విజయం.
బహశా ఇవన్నీ తలుచుకునే కావచ్చు, అశ్వనీదత్ కళ్ల వెంట కన్నీళ్లు వచ్చాయని దగ్గరి జనాలు చెబుతున్నారు. విడుదల ముందు రోజు రాత్రి సినిమాను ప్రత్యేకంగా వేసుకుని, చూసిన తరువాత వచ్చిన ఫీడ్ బ్యాక్ కు, ప్రశంసలకు, అశ్వనీదత్ కు నోట మాట రాలేదట. కంట కన్నీళ్లు తప్ప.
మొత్తానికి దత్తుగారి అమ్మాయిలు ఐరన్ లెగ్ లు కాదు. మొండి ఘటాలు అనిపించుకున్నారు. మొత్తం దత్తుగారు తన బ్యానర్ మీద తీసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు. మహానటి ఒక్కటీ ఒక ఎత్తు.
జగదేకవీరుడు-అతిలోక సుందరి విడుదల డేట్ నాడు విడుదల చేయాలన్న సెంటిమెంట్ మాటేమో కానీ, ఆ సినిమా డబ్బులు తెస్తే, ఈ సినిమా అంతకు పదింతల పేరు తెచ్చింది.