ప్రతిభావంతమైన ఇంజనీరింగ్ బృందం చేయాల్సిన పనిని ‘కల్కి’ టీమ్ చేసింది. సినిమా కోసం వినూత్నమైన డిజైన్ తో ఓ కారు తయారు చేసేసింది. ఆ కారులోనే ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఇప్పుడు బుజ్జి ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఏం చేయగలదో కూడా అర్థమైంది. బుజ్జికి మరింత మైలేజ్ తీసుకురావడానికి తెర వెనుక ఇంకా చాలా హంగామానే నడిపిస్తోంది వైజయంతీ మూవీస్ బృందం.
సినిమా కోసం ఇలాంటి వినూత్నమైన ఆవిష్కరణలు చేసినపప్పుడు వాటికి సంబంధించిన పేటెంట్ హక్కులు తమ దగ్గరే ఉండేలా జాగ్రత్త పడుతుంటారంతా. ఇప్పుడు వైజయంతీ మూవీస్ కూడా అదే చేసింది. బుజ్జి మోడల్ పేటెంట్ హక్కులు దక్కించుకొంది. ఇప్పుడు ఈ బుజ్జిని దేశమంతా తిప్పబోతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలకు బుజ్జి వెళ్లబోతోంది. ముంబై, చెన్నై, కొచ్చి, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో బుజ్జిని తీసుకెళ్తారు. అక్కడ కొన్ని ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తారు. ఈ సినిమా ప్రమోషన్లలో విరివిగా బుజ్జిని వాడుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. సినిమా పూర్తయ్యాక.. ఈ బుజ్జిని అలానే భద్రపరచాలా? లేదా అభిమానులకు కానుక ఇవ్వాలా? లేదంటే వేలం వేసి, ఆ డబ్బులతో ఏమైనా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలా? అనే దిశగా వైజయంతీ మూవీస్ ఆలోచిస్తోంది. మొత్తానికి ఎలా చూసినా, ఈ బుజ్జి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి ఓ బ్రాండ్ గా ఉపయోగపడబోతోంది.