వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ‘మట్కా’ ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా ఇచ్చిన షాక్‌లో నిర్మాత ఉంటే, సొంత సంస్థలో బయటపడిన స్కామ్ సదరు నిర్మాతని దిమ్మతిరిగేలా చేసింది. సొంత ఆఫీస్‌లో దాదాపు 5.5 కోట్లు గోల్ మాల్ అయ్యాయన్న నిజం.. ఆయన ఆలస్యంగా తెలుసుకొన్నారు. వివరాల్లోకి వెళ్తే..
వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందించిన సినిమా ‘మట్కా’. ఈ సంస్థ సీఈఓ దాదాపు రూ.5.5 కోట్ల స్కామ్ కు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఓచర్లను తారుమారు చేయడం, దొంగ లెక్కలు చూపించడం, కమీషన్లు నొక్కేయడం.. ఇలా చేయాల్సిన ఘనకార్యాలన్నీ చేసి, దాదాపు రూ.5.5 కోట్లు వెనకేశాడని తెలుస్తోంది. వైరాలో తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’కూ ఈయనే సీఈఓ. సంస్థ నుంచి నెలకు దాదాపు రూ.2.5 లక్షల జీతం అందుకొంటున్నారీయన. అంతేకాదు… సొంత ఇన్నోవా కార్లని సంస్థలో అద్దెకు తిప్పుతూ మరో రెండు లక్షలు గడిస్తున్నారు. నిర్మాత ఈ సీఈఓని నమ్మి… సినిమా బాధ్యత అంతా ఆయన నెత్తిమీద వేస్తే, ఇదే అదునుగా రూ.5.5 కోట్లు వెనకేసేశాడు. సినిమా మరో వారం రోజుల్లో విడుదల అవుతోందనగా… సీఈఓ వ్యవహారంపై నిర్మాతకు ఫిర్యాదులు అందాయి. దాంతో ఒక్కసారి ఆయన ఎకౌంట్స్ క్రాస్ చెక్ చేయడంతో, ఈ స్కామ్ బయటపడింది. ప్రస్తుతం ఈసీఓని ఆఫీసుకు రావొద్దని హుకూం జారీ చేశారు. ఏయే విషయాల్లో ఫ్రాడ్ జరిగింది? అనేదానిపై నిర్మాత ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే సంస్థలో రూపొందిన ‘హాయ్ నాన్న’ చిత్రం విషయంలోనూ ఇలాంటి మోసాలు ఏమైనా జరిగాయా? అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అవన్నీ రుజువైతే చట్టపరంగానూ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.