భారత రాష్ట్ర సమితి, వైసీపీలకు వక్ఫ్ బిల్లు విషయంలో టెన్షన్ ప్రారంభమయింది. ఏప్రిల్ రెండో తేదీన జేపీసీ ఆమోదించిన వక్భ్ బిల్లు పార్లమెంట్ ముందు ఆమోదానికి రానుంది. ఈ క్రమంలో ఓటింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో లోక్ సభలో ప్రవేశ పెట్టినా కొన్ని పార్టీల అభ్యంతరాలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకు పంపించారు. ఆ కమిటీ చర్చలు జరిపి కొన్ని మార్పులతో అంగీకారం తెలిపి స్పీకర్ కు సమర్పించింది.
ఇప్పుడు మరోసారి ఆ బిల్లుపై లోక్ సభ, రాజ్యసభల్లో చర్చ జరగనుంది. వక్ఫ్ బిల్లు ముస్లిం లకు వ్యతిరేకమని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ముస్లిం సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింలు ఓటు బ్యాంకుగా ఉన్న పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్, వైసీపీ మాత్రం ఎటూ తేల్చలేకుండా ఉన్నాయి. ఈ విషయంపై స్పష్టమైన ప్రకటనలు చేయడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే ధైర్యం ఈ రెండు పార్టీలు చేస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఇటీవల బీఆర్ఎస్ బీజేపీకి కాస్త వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లి వచ్చారు. కవిత వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పారు. కానీ కేసీఆర్ వైపు నుంచి ఇంకా సిగ్నల్స్ రాలేదు. వైసీపీ నుంచి కూడా అంతే. లోక్ సభలో, రాజ్యసభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకించామని చెప్పి వాకౌట్ చేసినా బీజేపీకి మేలు చేసినట్లే అవుతుంది. తమను నమ్ముకున్న ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది. మరి ఏం చేయబోతున్నారో బుధవారం తేలే అవకాశం ఉంది.