మండపేటలో జగన్ ఎన్నికల ప్రచారం జనం ప్రాణాల మీదకు తెచ్చింది. ఎన్నికల ప్రచార సభలో అపశ్రుతి చోటు చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో జగన్ పాల్గొన్న సభలో భవనం గోడ కూలిపోయింది. దీంతో చాలా మందికి గాయాలు కాగా, అందులో ఇరవై మందికి తీవ్రమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆ 20 మందిలో మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లా మండపేట లో జగన్ పాల్గొన్న సభ కి వైఎస్ఆర్ సీపీ నేతలు భారీగా జనసమీకరణ చేయడంతో సభ కిటకిటలాడి పోయింది. స్థలం చాలక ఒక భవనం పిట్టగోడ పైకి జనాలు ఎక్కగా, ఆ పిట్ట గోడ కూలిపోయింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్నా కృష్ణ ఆస్పత్రికి తరలించారు. అయితే వైయస్ జగన్ తో పాటు మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.
భారీ జన సమీకరణ చేసే రాజకీయ పార్టీలు, ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, కీలకమైన ఈ ఎన్నికల సమయంలో ఎన్నో సభలు నిర్వహించే రాజకీయ పార్టీలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇతర పార్టీల సభలలో అపశృతులు జరిగితే బ్యానర్ స్టోరీలు కట్టే సాక్షి, ఈ వార్తను మాత్రం దాని ప్రాధాన్యతను వీలైనంతగా తగ్గించి ఓ మూల ఇవ్వడం సమకాలీన రాజకీయ పరిస్థితులతో పాటు సమకాలీన జర్నలిజం విలువలకు దర్పణం పడుతుంది.