సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ యమా షార్ప్ అయిపోయారు. వాళ్లకు అన్నీ గుర్తుంటాయి. సోషల్ మీడియానే గుర్తుంచుకొనేలా చేస్తుంది. అలాంటప్పుడు మేకర్స్ మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట నోరు జారినా… ఫ్యాన్స్ కి దొరికేస్తారు. నాగవంశీ తెచ్చిన ఓ పోలిక ఇప్పుడు చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ మధ్య కొత్త వైరాన్ని తెచ్చిపెట్టేలా వుంది.
ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా ‘డాకూ మహారాజ్’. ఈ సినిమాపై అటు నిర్మాత నాగవంశీ, ఇటు దర్శకుడు బాబీ చాలా ఆశలు పెట్టుకొన్నారు. టీజర్ బాగుంది. బాలయ్య లుక్స్ మాస్ కి ముఖ్యంగా ఫ్యాన్స్ కి నచ్చేలా ఉన్నాయి. గురువారం ఓ గీతాన్ని విడుదల చేశారు. ‘దబిడి దిబిడి’ అంటూ సాగే ఈ పాట మంచి మాస్ నెంబర్. బాలయ్య సినిమాల్లోని పంచ్ డైలాగుల్ని పేర్చి పాట రాశారు కాశర్ల శ్యామ్. అంత వరకూ ఓకే. అయితే ఇందులో బాలయ్య వేసిన స్టెప్పులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. కొన్ని మూమెంట్స్ మరీ చీప్‌గా ఉన్నాయన్నది సోషల్ మీడియా పోస్టుల సారాంశం. శేఖర్ మాస్టర్ ఏ దృష్టితో వాటిని కంపోజ్ చేశాడో కానీ, కొన్ని దెబ్బ కొట్టేశాయ్. ఇప్పటి వరకూ ఫుల్ పాజిటీవ్ బజ్ తో సాగిన ‘డాకూ..’కి ఈ పాటలోని ఆ స్టెప్పులే బ్రేకులు వేసేలా ఉన్నాయి.
దాంతో ఈ పాట ఇప్పుడు ట్రోలింగ్ కి గురి అవుతోంది. అయితే అవాల్సిన దానికంటే.. కాస్త ఎక్కువే ట్రోల్ అవుతుంది. దానికి కారణం నాగ వంశీ తెచ్చిన పోలిక. ఆయన ఓ ప్రెస్ మీట్ లో ‘వాల్తేరు వీరయ్యకంటే ఈ సినిమాని బాబి బెటర్ గా తీశాడు’ అని కామెంట్ చేశారు. తన సినిమాపై బాబీకి ప్రేమ ఉండొచ్చు. కాదనలేం. కానీ పక్క సినిమాతో పోలుస్తూ కామెంట్ చేయడం కాస్త విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అందుకొన్నారు. వాల్తేరు వీరయ్యలోని ‘వేర్ ఈజ్ ద పార్టీ’ పాటని రిఫర్ చేస్తూ, ఈ పాటకు పోలికలు తెస్తున్నారు. అందులో, ఈ పాటలోనూ ఐటెమ్ గాళ్ ఊర్వశీ రౌటాలానే. డాన్స్ మాస్టర్ కూడా ఒక్కరే. ఆ పాటలో చిరంజీవి స్టెప్పులెక్కడ? ఈ పాటలో బాలయ్య స్టెప్పులెక్కడ? రెండిటిలో ఏది బాగుంది? అనే కోణంలో కొత్త చర్చ లేవనెత్తారు. నిజానికి బాలయ్య స్టైల్ వేరు, చిరు గ్రేస్ వేరు. రెండింటికీ పోలిక పెట్టడం సమంజసం కాదు. కాకపోతే.. నాగవంశీ చేసిన పోలిక తెచ్చిన చేటు ఇది.
ఇది ఈ పాటతో ఆగుతుందా, రేపు సినిమా విడుదల అవుతుంది. బాగుంటే ఏ గొడవా ఉండదు. లేకపోతే మాత్రం ఇదిగో.. ఇలానే సోషల్ మీడియా సాక్షిగా పోలికలు మొదలైపోతాయి. అప్పుడు నాగవంశీ వాటికి సమాధానం చెప్పగలడా? `బాబి తీసిన బెస్ట్ సినిమా ఇదే` అని చెబితే సరిపోయేదానికి, చిరంజీవి సినిమాతో పోల్చి చెప్పడం ఇంత వరకూ తెచ్చింది. రేపు ఇది ఎక్కడ ఆగుతుందో?