ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ కారణంగా కశ్మీర్ లో జరిగిన అల్లర్లలో ఇంతవరకు 45 మంది మరణించారు. ఆ అల్లర్లని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటించారు. బుర్హాన్ వనీ ఒక కాశ్మీరీ యోధుడని, భారతసేనల చేతిలో మృతి చెందిన అమరుడని చెపుతూ పాకిస్తాన్ బ్లాక్ డే పాటించడం, భారత్ కి పుండు మీద కారం చల్లినట్లయింది. భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొంటూ, అల్లర్లని ప్రోత్సహిస్తే సహించేది లేదని హెచ్చరించింది. కాశ్మీర్ గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్ ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది.
అందుకు బదులుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిన్న పాక్ ఆక్రమిత కాశ్మీరులో మాట్లాడుతూ, “పాకిస్తాన్ లో కాశ్మీర్ విలీనం అయ్యే ఆ శుభదినం కోసం నేను ఎదురుచూస్తున్నాను. కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం అక్కడ పోరాటం కొనసాగుతోంది. వారికి మనం మద్దతు ఇవ్వాలి. వారి పోరాటం విజయవంతం అయ్యి కాశ్మీర్ అంతా పాకిస్తాన్ లో కలవాలని కోరుకొందాము,” అని అన్నారు.
భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ సమస్యపై గత 6 దశాబ్దాలుగా వాదోపవాదాలు చేసుకొంటున్నాయి. కానీ నేటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని దాని చేతిలో నుంచి భారత్ స్వాధీనం చేసుకోలేకపోయింది. నిన్ననే అక్కడ పాక్ ప్రభుత్వం ఎన్నికలు కూడా నిర్వహించింది. వాటిలో ప్రస్తుతం పాక్ లో అధికారంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీయే గెలిచింది కూడా. ఆ సందర్భంగానే నావాజ్ షరీఫ్ అక్కడకి వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై పాకిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకొందని స్పష్టం అయ్యింది. అలాగే జమ్మూ కాశ్మీర్ గత ఆరు దశాబ్దాలుగా భారత్ ఆధీనంలోనే ఉంది. క్రమం తప్పకుండా అక్కడ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భాజపా, పిడిపిల సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై భారత సార్వభౌమత్వాన్ని నిరూపించుకొందని స్పష్టం అయ్యింది. అయినా పాక్ ఏమీ చేయలేకపోతోంది.
అంటే గత ఆరు దశాబ్దాలుగా ఈ రెండు ప్రాంతాల సార్వభౌమత్వం, భౌగోళిక పరిస్థితులలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం అవుతోంది. అయినప్పటికీ రెండు దేశాలు కూడా రెండో దేశం అధీనంలో ఉన్న భూభాగంపై తమ హక్కులని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అలాగని ఆ హక్కులని నిరూపించుకొనే ప్రయత్నాలు చేయడం లేకపోతున్నాయి. ఆవిధంగా ఎన్నటికీ చేయలేవని ఇరుదేశాలకి కూడా తెలుసు. కానీ పాకిస్తాన్ తన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు భారత్ ని బూచిగా చూపుతూ ప్రజలలో అభద్రతాభావం స్థిరంగా నెలకొని ఉంచే ప్రయత్నం చేస్తుంటుంది. భారత్ కి అటువంటి సమస్యలేవీ లేనప్పటికీ పాక్ కారణంగా ఆ రొంపిలో దిగక తప్పడం లేదు.